సీనియారిటీ అయితే సీఎం ఎందుకయ్యావు బాబు
దేశంలోనే తానే సీనియర్ అంటూ వ్యాఖ్యలు చేసిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.మాట్లాడితే నేను సీనియర్ అని భజన చేసుకోవడం చంద్రబాబుకు అలవాటైపోయిందని రోజా ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి ఉండాల్సింది సీనియారిటీ కాదని సిన్సియారిటీ ముఖ్యమన్న సంగతి బాబు తెలుసుకోవాలని రోజా అన్నారు. ఎన్టీర్ సీనియారిటీ ప్రకారం వస్తే ఎందుకు వెన్నుపోటు పొడిచావు బాబు..? అని ప్రశ్నించారు. తనకంటే సీనియర్లు అయిన యనమల రామకృష్ణుడు - అశోకగజపతి రాజులను ముఖ్యమంత్రిలను చేయకుండా చంద్రబాబు ఎందుకు ముఖ్యమంత్రి అయ్యారని రోజా ప్రశ్నించారు.
అవసరానికి తగినట్లుగా మాటమార్చడంలో బాబును మించిన వారు ఎవరూ లేరని రోజా మండిపడ్డారు. నరేంద్ర మోడీ నా రాష్ట్రానికి వస్తే ఉరితీస్తానని గోద్రా అల్లర్ల సందర్భంగా ప్రకటించిన చంద్రబాబు...ఆయన ప్రధాని అయ్యాక కాళ్ల బేరానికి వచ్చాడని రోజా ఎద్దేవా చేశారు. ఇప్పుడు సీనియర్ అంటూ చెప్తున్న చంద్రబాబు పరోక్షంగా ప్రధానమంత్రిని తన కంటే జూనియర్ అని గుర్తుచేస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. ప్రధాని నాకంటే జూనియర్ అనకుండా బాబు ఇలా ఇన్ డైరెక్టుగా ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకుండా అడ్డుపడుతున్నాడని రోజా మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కొని కేంద్రాన్ని నిలదీయలేక..తన ముఖ్యమంత్రి హోదాను కాపాడుకునేందుకు ఐదుకోట్ల మంది ఆశలను భూస్థాపితం చేస్తున్నాడని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని గ్రోత్ రేటును చూపిస్తూ బాబు కేంద్రాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి హోదా రాకుండా చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని చంద్రబాబును హెచ్చరించారు.
ప్రత్యేకహోదా వల్ల ఏం లాభం..? ప్రత్యేకహోదాతో ఏం లాభమని బాబు అనడం ఆయన సిగ్గుమాలిన రాజకీయాలకు నిదర్శనమని రోజా దుయ్యబట్టారు. ``హోదా కన్నా ప్యాకేజే గొప్పదని మాట్లాడుతున్నావ్..? నీవు తెచ్చిన ప్యాకేజీతో ఎంత మందికి ఉద్యోగాలు తీసుకొచ్చావ్..? ఎన్ని నిధులు, పరిశ్రమలు తెచ్చావో చెప్పగలవా`` బాబు అని నిలదీశారు. హోదా వల్ల ఏమి వస్తాయన్న చంద్రబాబు... అసెంబ్లీలో రెండుసార్లు ఎందుకు తీర్మానం చేశారో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. కేంద్రమంత్రుల కాళ్లు పట్టుకోవడానికి అనేకసార్లు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు...హోదా కోసమే వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లానని ఎందుకు చెప్పుకున్నారో తెలపాలని నిలదీశారు. ప్రత్యేకహోదా వల్ల ఎలాంటి ఉపయోగం ఉందో ఉత్తరాఖాండ్, హిమాచల్ ప్రదేశ్ వెళితే తెలుస్తుందని బాబుకు సూచించారు. హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టిన మీ ఎంపీలు సుజనా చౌదరి - సీఎం రమేష్ లాంటి నాయకులను అడిగి తెలుకోవాలని రోజా చురక అంటించారు. అధికారంలో ఉండి కూడ చంద్రబాబు ఏపీకి హోదా రాకుండా కుట్రపన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు హోదాపై చర్చిద్దామని వైఎస్ జగన్ అడిగితే పారిపోయిన చరిత్ర చంద్రబాబుదని ఎద్దేవా చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/