వైసీపీలో వాళ్లిద్దరూ ఎందుకు సైలెంటయ్యారు?

Update: 2019-10-16 04:11 GMT
ఒకప్పుడు వైసీపీ అంటే ఇద్దరి వాయిస్ ప్రముఖంగా వినిపించేది. ఒకరు రోజా కాగా మరొకరు వాసిరెడ్డి పద్మ. ఇద్దరూ చాలాకాలం పార్టీకి ప్రధానమైన గొంతుకగా ఉన్నారు. వారిని ఎదుర్కోవడం ఇతర పార్టీల నాయకులకు కష్టంగా ఉండేది. వారు మీడియాతో మాట్లాడినా - టీవీ డిబేట్లలో పాల్గొన్నా రాష్ట్రమంతా వినేది. కానీ, ఈ ఇద్దరి గొంతూ కొన్నాళ్లుగా వినిపించడం లేదు. ముఖ్యంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా ఈ ప్రధాన గళాలు నెమ్మదించడంతో పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు. పార్టీ తరఫున ప్రస్తుతం టీవీ డిబేట్లలో పాల్గొంటున్నవారు ఇతర పార్టీల నాయకులను సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నారు.

రోజా మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, జగన్ ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో కొద్దిరోజులు ఆమె అసంతృప్తి చెందారన్న ప్రచారమూ జరిగింది. అయితే, ఆమెకు ఏపీఐఐసీ పదవిని జగన్ కట్టబెట్టారు. అయినప్పటికీ ఆమె ఎందుకో మునుపటిలా యాక్టివ్‌ గా లేరు. పెద్దగా మీడియాతో మాట్లాడడం లేదు.

ఇక వాసిరెడ్డి పద్మకు ఇటీవలే మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చారు జగన్. ఆమె ఎమ్మెల్సీ పదవి ఆశించినప్పటికీ ఈ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, ఎమ్మెల్సీ పదవికి ముందే జగన్‌ కు కమిట్ మెంట్లు ఉండడం.. మంత్రివర్గంలోకి తీసుకున్న మోపిదేవి వంటివారికి ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఉండడంతో వాసిరెడ్డి పద్మ పరిస్థితులను అర్థం చేసుకున్నారనే చెబుతున్నారు. అయితే, మహిళా కమిషన్ చైర్మన్ పదవిలోకి వచ్చిన తరువాత కూడా ఆమె పెద్దగా యాక్టివేట్ కాలేదు. తాజాగా నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్ లైంగిక వేధింపుల కేసుల విషయంలో ఆమె సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

రోజా - పద్మలు యాక్టివేట్ అయితేనే వైసీపీ ప్రస్తుతం బాలారిస్టాలను కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. పార్టీ అధికార ప్రతినిధులు టీడీపీ నేతలను డిబేట్లలో ఎదుర్కోలేకపోతున్నారు. టీడీపీకి నాలెడ్జ్ సెంటర్ ఉండడంతో అక్కడి నుంచి ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన సమాచారం అందుతుంటుంది. కానీ, వైసీపీకి అలాంటి వ్యవస్థ లేదు. నాయకులే హోం వర్క్ చేసి సరైన సమాచారంతో తమ వాదనలు వినిపించాలి. అందరిలో ఈ సామర్థ్యం లేకపోవడంతో విఫలమవుతున్నారు. దీంతో ఈ పరిస్తితుల్లో వాసిరెడ్డి పద్మ - రోజాలు మళ్లీ తమ వాయిస్ వినిపిస్తేనే బెటరని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
Tags:    

Similar News