ఊపిరి పీల్చుకో ఇండియా .. హిట్ మ్యాన్ వచ్చేస్తున్నాడు !

Update: 2020-12-11 12:42 GMT
క్రికెట్ టీం ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్లడానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఐపీఎల్ ఆడుతుండగా.. రోహిత్ తొడ కండరాల గాయం బారిన పడిన సంగతి తెలిసిందే. ఆసీస్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమైన హిట్ మ్యాన్.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో నేడు నిర్వహించిన ఫిట్ ‌నెస్ టెస్టులో పాస్ అయ్యాడు. ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గావాస్కర్ ట్రోఫికి ముందు టీమిండియాకు అతి పెద్ద గుడ్ న్యూస్ ఇది అని చెప్పవచ్చు.

డిసెంబరు 17 నుంచి ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ని టీమిండియా ఆడనుండగా.. రోహిత్ శర్మని కేవలం టెస్టు సిరీస్‌కి మాత్రమే భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు. టెస్టు సిరీస్‌కి ఎంపికైన రోహిత్ శర్మ.. చివరి రెండు టెస్టులు మాత్రమే ఆడే అవకాశం ఉంది. రోహిత్ ఆస్ట్రేలియా పర్యటను రేపే బయల్దేరి వెళ్లినా.. సిరీస్ బయో- సెక్యూర్ వాతావరణంలో జరుగుతుండటంతో.. ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన తర్వాత నిబంధనల ప్రకారం అతడు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. ఈ నిబంధనల కారణంగా డిసెంబర్ చివరికి గానీ రోహిత్ శర్మ జట్టుతో చేరలేడు. డిసెంబరు 17 నుంచి 21 వరకూ మొదటి టెస్టు జరగనుండగా.. ఆ తర్వాత డిసెంబరు 26 నుంచి 30 వరకూ రెండో టెస్టు జరగనుంది. కాబట్టి రోహిత్ చివరి రెండు టెస్టులకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

కాగా మొదటి టెస్టు అనంతరం టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పెటర్నీటి సెలవులపై స్వదేశానికి రానున్నాడు. కోహ్లి స్థానంలో మిగిలిన మూడు టెస్టులకు అజింక్యా రహానే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇప్పటికే మయాంక్ అగర్వాల్ టెస్టు ఓపెనర్‌గా ఖాయమవగా.. అతనికి జోడీగా శుభమన్ గిల్ లేదా పృథ్వీ షా తొలి రెండు టెస్టుల్లో భారత్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించే అవకాశం ఉంది.
Tags:    

Similar News