రెజ్ల‌ర్ సుశీల్ కుమార్ ను ప‌ట్టిస్తే రూ.ల‌క్షః పోలీసులు

Update: 2021-05-18 09:30 GMT
రెజ్ల‌ర్ సుశీల్ కుమార్ పై ల‌క్ష‌ల రూపాయ‌ల రివార్డ్ ప్ర‌క‌టించారు ఢిల్లీ పోలీసులు. ఆయ‌న ఆచూకీ చెప్పిన‌వారికి ఈ మొత్తం ఇచ్చేస్తామ‌ని అనౌన్స్ చేశారు. సుశీల్ ఓ హ‌త్య కేసులో నిందితుడిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని రోజులుగా ఆయ‌న ప‌రారీలో ఉన్నారు. దీంతో.. అత‌నిపై నాన్ బెయిల‌బుల్ వారెంట్, లుక్ ఔట్ నోటీసులు జారీచేసిన పోలీసులు.. తీవ్రంగా గాలిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆచూకీ ల‌భించ‌క‌పోవడంతో రివార్డు ప్ర‌క‌టించారు.

ఢిల్లీలో కొంద‌రు నివ‌సిస్తున్న ఇంటిని ఖాళీ చేయాల‌ని సుశీల్‌, అజ‌య్ అనే మ‌రో వ్య‌క్తి ఒత్తిడి తెచ్చార‌ట‌. దీంతో.. వివాదం మొద‌లైంద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఈ నెల 11న అర్ధ‌రాత్రి ఒంటిగంట స‌మ‌యంలో ఈ రెండు వ‌ర్గాలు గొడ‌వ‌కు దిగాయ‌ట‌. ఇష్ట‌మొచ్చిన‌ట్టు దాడిచేసుకున్నార‌ట‌. ఈ గ‌లాట‌లో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డగా.. అందులో సాగ‌ర్ (23) అనే వ్య‌క్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

దీంతో.. సుశీల్ తోపాటు అజ‌య్ అనే వ్య‌క్తిపై హ‌త్య‌కేసు న‌మోదు చేశారు పోలీసులు. మృతుడు సాగ‌ర్ హెడ్ కానిస్టేబుల్ కొడుకు కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో.. పోలీసులు కేసును సీరియ‌స్ గా తీసుకున్నారు. అయితే.. ఈ ఆరోప‌ణ‌ల‌ను సుశీల్ ఖండించాడు. అత‌నెవ‌రో త‌మ‌కు తెలియ‌ద‌ని, కొంత మంది గుర్తుతెలియ‌ని వారు వ‌చ్చి త‌మ గ్రౌండ్ వ‌ద్ద గొడ‌వ చేస్తుంటే.. తామే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చామ‌ని చెప్పాడు. ఆ త‌ర్వాత నుంచీ అత‌ను క‌నిపించ‌కుండా పోయాడ‌ని స‌మాచారం.

అప్ప‌టి నుంచి సుశీల్, అజ‌య్‌ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. సుశీల్ పై ల‌క్ష రూపాయ‌ల రివార్డు ప్ర‌క‌టించిన పోలీసులు.. అజ‌య్ అనే వ్య‌క్తిపైనా 50 వేల రూపాయ‌ల రివార్డు అనౌన్స్ చేశారు.
Tags:    

Similar News