పాపం.. గడికోట.. ఒంటరయ్యారా.. ?
ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి నియోజకవర్గాన్ని వైసీపీకి కంచుకోటగా మార్చడంలో శ్రీకాంత్ రెడ్డి తిరుగులేని కృషి చేశారు.;
గడికోట శ్రీకాంత్‌రెడ్డి. వైసీపీ సీనియర్ నేత, అప్పటి ప్రభుత్వంలో చీఫ్ విప్‌గా రెండున్నరేళ్ల పాటు సైతం పనిచేశారు. వాస్తవానికి జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్న సమయంలో గడికోటే తొలుత జగన్‌కు అండగా నిలిచారు. అయితే.. సామాజిక వర్గ సమీకరణల నేపథ్యంలో గడికోటకు ఆది నుంచి ఆశించిన పదవి ఏదీ దక్కలేదన్నది ఆయన అనుచరులు చెబుతారు. తరచుగా ఆయన కూడా అంతర్గత సమావేశాల్లో "ఏం చేస్తాం?!" అని వాపోతూ ఉంటారు.
ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి నియోజకవర్గాన్ని వైసీపీకి కంచుకోటగా మార్చడంలో శ్రీకాంత్ రెడ్డి తిరుగులేని కృషి చేశారు. తండ్రి వారసత్వం నుంచి ఆయన రాజకీయంగా ఎదిగారు. ఇక, గత ఎన్నికల్లో పరాజయం పాలైన గడికోట.. తర్వాత సైలెంట్ అయిపోయారు. పార్టీ పరంగా ఆయనకు జగన్ దగ్గర మంచి ర్యాపో ఉన్నప్పటికీ.. స్థానికంగా నాయకులతో ఆయనకు పొసగడం లేదని తెలుస్తోంది. దీంతో దాదాపు ఇప్పుడు ఆయన ఒంటరి రాజకీయాలనే చేస్తున్నారని తెలుస్తోంది.
తాజాగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి ప్రాంతాన్ని మదనపల్లె జిల్లాకు మార్చడాన్ని గడికోట తీవ్రంగా నిరసిస్తున్నారు. గతంలో ఆయనే.. రాయచోటిని పట్టుబట్టి అన్నమయ్య జిల్లా కేంద్రంగా మార్చారు. కానీ.. ఇప్పుడు అదికాస్తా.. మదనపల్లెలో కలిసిపోయింది. దీనిపై పోరాడకపోతే.. ఇటు రాజకీ యంగా గడికోటకు ఇబ్బంది తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన పోరాటానికి సిద్ధమవుతున్నారు. కానీ, వాస్తవానికి.. వైసీపీ నాయకులు ఎవరూ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు.
ఎందుకంటే.. గతంలో రాజంపేటను కేంద్రంగా చేయాలని ఆందోళన చేసినప్పుడు.. తమను పట్టించుకో లేదన్న ఆవేదన వారిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గడికోట చేసే ఆందోళనలకు వారు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో సాధారణ ప్రజలకే గడికోట పిలుపునిచ్చారు. అందరూ కలిసి రావాలని.. రాయచోటిని కాపాడుకుందామని అన్నారు. దీనికి ఎంత మంది స్పందిస్తారన్నది పక్కన పెడితే.. పార్టీలో గడికోట ఒంటరి అయ్యారన్నది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.