వివాహ ఊరేగింపు పై దూసుకెళ్లిన ట్రక్కు.. చివరలో ట్విస్ట్.. ఏంటి సామీ ఇది..
నేడు బ్రేకింగ్ న్యూస్ అంటే టీవీ చానళ్లు కాదు, సోషల్ మీడియా ఖాతాలే. ఏ చిన్న వీడియో బయటకు వచ్చినా నిమిషాల్లో లక్షల మందికి చేరుతోంది.;
ఒకవైపు మంగళవాయిద్యాలు, మరోవైపు బంధుమిత్రుల కోలాహలం.. వివాహ ఊరేగింపు ఊహించని మలుపు. ఛత్తీస్‌గఢ్‌లో ఫిబ్రవరి 12న జరిగిన ఒక ఘటన ఈ ఆనందాన్ని క్షణాల్లో విషాదంగా మార్చేసింది. ఒక భారీ ట్రక్కు వివాహ ఊరేగింపులోకి దూసుకెళ్లడం, ఐదుగురు గాయపడడం నాగరిక సమాజంలో భద్రతా వైఫల్యానికి నిదర్శనం. అయితే, ఈ భౌతిక ప్రమాదం కంటే భయంకరమైనది ఇప్పుడు డిజిటల్ తెరపై జరుగుతోంది. బాధితుల పట్ల సానుభూతి చూపాల్సిన వేదికలు, నిందితుడిని కనుక్కోడి చూద్దాం అంటూ కాంపిటీషన్ నిర్వహించడం సామాజిక విజ్ఞతకే సవాల్‌గా నిలుస్తోంది.
సమాచార విప్లవమా? అసత్యాల నిలయమా?
నేడు బ్రేకింగ్ న్యూస్ అంటే టీవీ చానళ్లు కాదు, సోషల్ మీడియా ఖాతాలే. ఏ చిన్న వీడియో బయటకు వచ్చినా నిమిషాల్లో లక్షల మందికి చేరుతోంది. ఇందులో ఛత్తీస్‌గఢ్ ఘటనకు సంబంధించిన వీడియో కూడా విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. సమాచారం త్వరగా అందడం మంచిదే అయినా, అధికారిక వాస్తవాలు ధృవీకరించేందుకు ముందే కథనాలను వక్రీకరించడం ప్రమాదకరంగా మారుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు సమాచార వ్యాప్తిలో ఎంతటి వేగాన్ని ప్రదర్శిస్తున్నాయో, బాధ్యతారాహిత్యంలో కూడా అంతే వేగంగా సాగుతున్నాయి. ఫలితంగా ప్రజల అవగాహన వాస్తవాల కంటే వక్రీకరణల వైపే మొగ్గు చూపుతోంది.
రమేష్ తివారీ పోస్ట్..
ఈ సంఘటనకు సంబంధించి రమేష్ తివారీ చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒక వివాహ ఊరేగింపు వేడుక జరుగుతుంది.. దారి ఇవ్వకపోవడంతో ట్రక్కు డ్రైవర్ ఊరేగింపుపై నుంచి వాహనదాన్ని పోనిచ్చాడు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని నివేదించడం వరకు బాధ్యతాయుతమైన పనే. కానీ, ఆ పోస్ట్ చివరలో ఉన్న శీర్షిక డ్రైవర్ పేరును ఊహించమని నెటిజన్లను కోరడం దురదృష్టకరం. ఇది ఒక తీవ్రమైన రోడ్డు ప్రమాదాన్ని 'క్విజ్' లాగా మార్చేసింది. డ్రైవర్ పేరు ఆధారంగా సమాజాన్ని విభజించాలనే కుట్ర లేదా అనవసరమైన ఊహాగానాల వైపు ప్రజల దృష్టిని మళ్లించడం దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. అధికారుల విచారణ ముగిసే ముందే సోషల్ మీడియా వేదికలపై 'డిజిటల్ కోర్టులు' పెట్టి తీర్పులు ఇవ్వడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు.
నిర్వాహకులు బాధ్యత మరువద్దు..
ఈ వీడియో కనుక నిజమైతే ఇందులో కొన్ని చెప్పుకొని తీరాలి. వివాహ ఊరేగింపు వంటి బహిరంగ సమావేశాలు నిర్వహించేప్పుడు నిర్వాహకులకు బాధ్యత ఉంటుంది. రద్దీగా ఉండే రహదారులపై ట్రాఫిక్ సమన్వయం లేకుండా ఊరేగింపులు నిర్వహించడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు, రహదారిపై వెళ్లే వాహనదారులు కూడా సంయమనం పాటించాలి. పండుగ ఘటనలు లేదా ఊరేగింపుల సమయంలో సహనం వహించడం వల్ల ప్రాణనష్టాన్ని నివారించవచ్చు. ట్రాఫిక్ నిబంధనల పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు, బహిరంగ సభలు, ఊరేగింపుల నిర్వహణలో పోలీసుల అనుమతి, ముందస్తు ప్రణాళిక తప్పనిసరి.
డిజిటల్ సంయమనం అవసరం
ఛత్తీస్‌గఢ్ ఎపీసోడ్ మనకు భద్రత, సంయమనం ప్రాముఖ్యత గుర్తు చేస్తోంది. రహదారిపై డ్రైవర్ బాధ్యత ఎంత ఉందో, డిజిటల్ వేదికలపై నెటిజన్ల బాధ్యత కూడా అంతే ఉంది. ఒక పేరును ఊహించమనో లేదా ఒక వర్గాన్ని టార్గెట్ చేయమనో అడిగే శీర్షికలు సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తాయి తప్ప, బాధితులకు న్యాయం చేయలేవు. అధికారులను తమ పనిని చేయనిద్దాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మనం చేయాల్సింది వాస్తవాలను గౌరవించడం, బాధితుల పట్ల మానవత్వంతో వ్యవహరించడం. వైరల్ పిచ్చితో వాస్తవాలను బలితీసుకోకుండా ఉండటమే నేటి తరం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం.