నా భర్తను కిడ్నాప్ చేశారు.. కట్ చేస్తే ఖాకీలు సైతం షాక్

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమేరా ఫుటేజ్ ను పరిశీలించారు. అందులో అర్థరాత్రి వేళలో అపార్టుమెంట్ వద్దకు వచ్చిన యువతుల్లో ఒకరిని గుర్తించారు.;

Update: 2026-02-22 06:11 GMT

తన భర్త కిడ్నాప్ అయ్యాడంటూ ఒక భార్య ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సైతం అవాక్కైన ఘటన హైదరాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. లవ్వర్ తో గడిపేందుకు కిడ్నాప్ నాటకానికి తెర తీసిన ఇతగాడి భాగోతం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది. పెళ్లై.. తొమ్మిదేళ్ల కుమార్తెను వదిలి ప్రియురాలితో భారీ నాటకానికి తెర తీసిన ఇతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే అతడి ఆచూకీని గుర్తించిన పోలీసులు.. అతడ్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రియురాలితో గడిపేందుకు ఇతగాడు వేసిన ప్లాన్ తో ఔరా అనుకునే పరిస్థితి. ఇంతకూ అసలేం జరిగిందంటే..

రామాంతాపూర్ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ జనప్రియ అపార్టుమెంట్లో ఒక 34 ఏళ్ల వ్యక్తి భార్య, తొమ్మిదేళ్ల కుమార్తెతో గడుపుతున్నాడు. ఇతను మాదాపూర్ లోని ఒక పబ్ లో వస్తువుల కొనుగోళ్ల విభాగానికి మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. గురువారం రాత్రి స్నేహితులు వచ్చారని చెప్పి.. ఇంట్లో నుంచి బయటకు వచ్చి.. బయట తలుపు వేసుకొని వెళ్లాడు.

ఉదయానికి కూడా తిరిగి రాకపోవటంతో.. భర్త ఆచూకీ కోసం ఆందోళన చెందిన భార్య అపార్టుమెంట్ సీసీ ఫుటేజ్ ను చెక్ చేసింది. అందులో తన భర్త వేరే వాళ్లతో కలిసి వాహనంలో వెళ్లిపోయిన వైనాన్ని గుర్తించి.. తన భర్తను ఎవరో వచ్చి తీసుకెళ్లినట్లుగా భావించింది. అనంతరం మాదాపూర్ లో అతను పని చేసే పబ్ కు వెళ్లి.. తన భర్తను ఎవరో కిడ్నాప్ చేసినట్లుగా చెప్పటంతో పబ్ నిర్వాహకులు సైతం మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమేరా ఫుటేజ్ ను పరిశీలించారు. అందులో అర్థరాత్రి వేళలో అపార్టుమెంట్ వద్దకు వచ్చిన యువతుల్లో ఒకరిని గుర్తించారు. ఆమె కూడా పబ్ లోనే పని చేస్తుందన్న సమాచారంతో ఆమెను విచారించారు. దీంతో.. అసలు విషయం వెలుగు చూసింది. పబ్ లో చాలా రోజులుగా బెంగాలీ యువతితో సహజీవనం చేస్తున్నాడని.. పబ్ లో పని చేసే వారి సాయంతో కిడ్నాప్ ప్లాన్ వేసినట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో అతని ఫోన్ నెంబరు ఆధారంగా అతడి లొకేషన్ ను ట్రేస్ చేయగా.. అతను ఒడిశాలో ఉన్నట్లుగా గుర్తించారు. అతడ్ని వెనక్కి తీసుకొచ్చేలా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అసలు విషయం బయటకు రావటంతో భార్య షాక్ తినటమే కాదు.. తనకు తెలీకుండా ఇంత జరిగిందా? అన్న ఆవేదనలో ఉన్నట్లు తెలిసింది.

Tags:    

Similar News