పవన్ ను కదిలించిన ఊరు.. రూ.50 లక్షల విరాళం, వెరీ ఇంట్రెస్టింగ్!

పవన్ చొరవతో కొణిదెల గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పల్లెపండగ 1.0లో సుమారు రూ. 20 లక్షలకు పైగా నిధులు వెచ్చించి మూడు రహదారులను నిర్మించారు.;

Update: 2026-02-22 09:15 GMT

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఓ గ్రామం కదిలిచింది. రెండేళ్ల క్రితం ఆ గ్రామానికి వెళ్లిన పవన్ లో సెంటిమెంట్ ను రగిలిచింది. అప్పటి నుంచి ఆ ఊరు పవన్ సొంతూరుగా మారిపోయింది. 20 నెలల వ్యవధిలో గ్రామం రూపురేఖలు మారిపోయేలా చేసింది. పంచాయతీ రాజ్ మంత్రిగా ప్రభుత్వ నిధులతో ఆ గ్రామాభివృద్ధికి బాటల పరిచిన పవన్.. గ్రామంపై పెంచుకున్న మమకారంతో సొంతంగా రూ.50 లక్షలు సమకూర్చారు. రాష్ట్రంలో వేలాది గ్రామాలు ఉండగా, పవన్ ఆ గ్రామంపై అంతలా ప్రేమ పెంచుకోవడానికి కారణం చాలా చిన్నదే. కానీ, అది చాలా తీవ్రమైన భావోద్వేగానికి సంబంధించినది.. ఆ సంబంధమే పవన్ ఇంటిపేరు. ఆ ఊరి పేరు ఒక్కటి కావడమే..

నిజమే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటి పేరు ఉండటమే నంద్యాల జిల్లాలోని ‘కొణిదల’ గ్రామం రూపురేఖలను మార్చివేసింది. నందికొట్కూరు మండలంలో ఉన్న ఈ గ్రామం 20 నెలల క్రితం వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో పర్యటించిన పవన్ కల్యాణ్ తన ఇంటి పేరు ఉన్న గ్రామం కోసం తెలుసుకుని ప్రేమ పెంచుకున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. అధికారంలోకి రాగానే ‘కొణిదల’ గ్రామాన్ని ప్రత్యేక ఆసక్తితో అభివృద్ధి చేయిస్తున్నారు పవన్.

పంచాయతీరాజ్ మంత్రిగా కొణిదల గ్రామానికి అనేక నిధులు విడుదల చేశారు పవన్. పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0, సాస్కీ, గ్రామీణ రహదారి అభివృద్ధి సబ్ ప్లాన్ తదితర పథకాల ద్వారా వచ్చిన నిధులతో రోడ్లు, డ్రెయిన్లు, కాలువల అభివృద్ధి చేశారు. గోకులాలు, బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణ పథకం కింద గ్రామానికి భారీగానే లబ్ధి జరిగింది. సుమారు రూ. 6 కోట్లకు పైగా నిధులతో కొణిదెల గ్రామ రూపురేఖలే మార్చివేశారు పవన్. అంతేకాకుండా సొంతంగా రూ.50 లక్షలు విరాళంగా సమకూర్చి గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించారు.

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో పవన్ దృష్టిని కొణిదెల ఆకర్షించినట్లు చెబుతున్నారు. గత ఏడాది నందికొట్కూరు నియోజకవర్గంలో ఫారం పాండ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లిన సందర్భంలో ఇచ్చిన మాట ప్రకారం ఆ గ్రామాభివృద్ధికి రూ. 50 లక్షల విరాళం అందజేశారు. ఈ డబ్బుతో కొణిదెల గ్రామంలో 90 వేల లీటర్ల రక్షిత తాగునీటి పథకాన్ని నిర్మించారు. ఈ ట్యాంక్ కొణిదెల గ్రామంలో 2 వేల మంది దాహర్తి తీర్చనుంది. వేసవికి ముందే ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం పూర్తి కావడంపై పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. సకాలంలో నిర్మాణం పూర్తి చేసేందుకు సహకరించిన జిల్లా అధికార యంత్రాంగానికి, గ్రామీణ నీటి సరఫరా విభాగం (RWS) అధికారులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.

పవన్ చొరవతో కొణిదెల గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పల్లెపండగ 1.0లో సుమారు రూ. 20 లక్షలకు పైగా నిధులు వెచ్చించి మూడు రహదారులను నిర్మించారు. పల్లెపండగ 2.0లో రూ. 45 లక్షల అంచనా వ్యయంతో ఏడు సీసీ రోడ్లు నిర్మించారు. వీటితో పాటు గ్రామీణ రహదారి అభివృద్ధి సబ్ ప్లాన్ నిధులతో కొణిదెల గ్రామంలోని జిల్లా పరిషత్ స్కూల్ నుంచి పగిడ్యాల మండల పరిధిలోని లక్ష్మాపురం వరకు 5 కిలోమీటర్ల మేర బి.టి. రోడ్డు నిర్మాణానికి రూ. 4 కోట్లు, ఆర్ అండ్ బి రోడ్డు నుంచి కొణిదెల గ్రామం వరకు ఉన్న రోడ్డు పునరుద్ధరణ పనులకు రూ. 45 లక్షలు మంజూరు చేయించారు. వీటితో పాటు ఆ గ్రామ ప్రజల అభ్యర్ధన మేరకు 4 గోకులాలు, గృహ నిర్మాణశాఖ సహకారంతో 19 ఇళ్లు, నీటితొట్టెలు నిర్మించారు. రైతుల కోసం 49 ఫీడర్ ఛానల్స్ ను జాతీయ ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి చేశారు. రెండు మైనర్ కాలువల పునరుద్ధరణ, మూడు కమ్యూనిటీ చెక్ డ్యామ్స్ మరమ్మత్తులు పూర్తి చేశారు. ఇచ్చిన హామీ మేరకు గ్రామస్తులు అడిగిన ప్రతి పని చేస్తూ కొణిదలను తన సొంతూరుగా మార్చుకున్నారు పవన్.

Tags:    

Similar News