ఇండియన్ 'ఎప్‌స్టీన్' ఫైల్స్: 33 మంది చిన్నారుల జీవితాలతో చెలగాటం.. దంపతులకు ఉరిశిక్ష!

ఈ కేసులో అత్యంత విస్మయం కలిగించే అంశం ఏంటంటే వీరు తీసిన అశ్లీల వీడియోలను కేవలం భద్రపరుచుకోకుండా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేశారు.;

Update: 2026-02-22 07:59 GMT

సమాజంలో గౌరవప్రదమైన ఉద్యోగం.. చుట్టూ నాగరిక ప్రపంచం.. కానీ ఆ ఇంటి గోడల వెనుక సాగుతున్నది మాత్రం నరకప్రాయమైన క్రీడ. అమెరికాను వణికించిన 'ఎప్‌స్టీన్' లైంగిక కుంభకోణం తరహాలోనే ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసిన ఈ దారుణ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పదేళ్లపాటు చిన్నారులను వేధిస్తూ ఆ దృశ్యాలను డార్క్ వెబ్‌లో విక్రయించిన కిరాతక దంపతులకు న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

అమాయకత్వమే పెట్టుబడిగా.. చీకటి వ్యాపారం

బందా జిల్లాకు చెందిన రామ్ భవన్ ప్రభుత్వంలో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. బయటకు విద్యావంతుడిగా కనిపించినా లోపల మాత్రం ఒక రాక్షసుడు దాగి ఉన్నాడని సీబీఐ విచారణలో తేలింది. ఇతనికి భార్య దుర్గావతి పూర్తిస్థాయిలో సహకరించేది. వీరిద్దరూ కలిసి 2010 నుండి 2020 వరకు ఒక పక్కా ప్రణాళికతో ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారు. 3 నుండి 16 ఏళ్ల వయస్సున్న పేద కుటుంబాలకు చెందిన బాలురకు చాక్లెట్లు, బిస్కెట్లు, మొబైల్ ఫోన్లు చూపి ఆశ చూపించి చిన్నారులను నిర్బంధించి లైంగిక దాడులు చేయడం, వాటిని వీడియోలు తీయడం విక్రయించి సొమ్ము చేసుకోవడం చేశారు.

డార్క్ వెబ్ - గ్లోబల్ నెట్‌వర్క్

ఈ కేసులో అత్యంత విస్మయం కలిగించే అంశం ఏంటంటే వీరు తీసిన అశ్లీల వీడియోలను కేవలం భద్రపరుచుకోకుండా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేశారు. ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా విదేశీ కస్టమర్లకు లైవ్ స్ట్రీమింగ్ చేసేవారు. అమెరికా, యూరప్ దేశాల్లోని చైల్డ్ పోర్నోగ్రఫీ మాఫియాతో వీరికి ప్రత్యక్ష సంబంధాలున్నట్లు సీబీఐ గుర్తించింది. సీబీఐ దాడుల్లో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లలో వేల సంఖ్యలో అభ్యంతరకర వీడియోలు లభ్యమయ్యాయి. పిల్లలు ఎవరైనా ఎదురు తిరిగితే వారి తల్లిదండ్రులను చంపేస్తామని, గొలుసులతో కట్టేసి బెల్టులతో కొట్టేవారని బాధితులు వాపోయారు.

న్యాయస్థానం ఆగ్రహం: అరుదైన కేసుల్లో అత్యంత అరుదైనది

ఈ కేసును విచారించిన ప్రత్యేక పోక్సో కోర్టు, నిందితుల చర్యలను నాగరిక సమాజం తలదించుకునేలా ఉన్నాయని అభివర్ణించింది. రామ్ భవన్ , అతని భార్య దుర్గావతికి మరణశిక్ష ఖరారు చేసి సంచలన తీర్పునిచ్చింది. బాధితులైన 33 మంది బాలురకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున తక్షణ పరిహారం చెల్లించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మన చుట్టూ ఉన్న ప్రమాదంపై హెచ్చరిక

ఈ ఘటన డిజిటల్ యుగంలో మన పిల్లల భద్రత ఎంత ప్రమాదంలో ఉందో మరోసారి గుర్తుచేస్తోంది. కేవలం బయటి వ్యక్తులే కాదు.. మనకు తెలిసిన వారు, గౌరవప్రదమైన హోదాల్లో ఉన్నవారు కూడా ఇటువంటి నేరాలకు పాల్పడవచ్చని ఈ 'ఇండియన్ ఎప్‌స్టీన్' కేసు నిరూపించింది.

Tags:    

Similar News