సెన్సేషనల్ న్యూస్: మావోయిస్టు అగ్రనేత 'దేవ్ జీ' లొంగుబాటు.. 6 దశాబ్దాల సాయుధ పోరాటానికి తెర!

అయితే అప్పట్లో దేవ్ జీ అరెస్టుపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. కానీ దేవ్ జీ సురక్షితంగా ఉన్నట్లు మావోయిస్టులు ప్రకటించడంతో ఈ వదంతులకు ఫుల్ స్టాప్ పడ్డాయి.;

Update: 2026-02-22 07:58 GMT

మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆరు దశాబ్దాల సాయుధ పోరాటం ముగింపు దశకు చేరిందన్న సంకేతాలను నిజం చేస్తూ ఆ పార్టీ అగ్రనేత దేవ్ జీ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనతోపాటు మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు రాజిరెడ్డి, మరో 16 మంది కీలక నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దేవ్ జీ టార్గెట్ గా కేంద్ర బలగాలు రెండు రోజుల కిందట ఆపరేషన్ కర్రె గుట్టలు-2 చేపట్టినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో దేవ్ జీతోపాటు మావోయిస్టు కీలక నేతలు తెలంగాణలోని అసిఫాబాద్ అడవుల్లో ఎస్ఐబి పోలీసులకు లొంగిపోయినట్లు చెబుతున్నారు. దేవ్ జీ లొంగుబాటును ఇంకా అధికారికంగా ప్రకటించాల్సివుంది.

మావోయిస్టు ప్రధాన కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగుబాటు వార్తలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారత్ ఆవిష్కరిస్తామని కేంద్రం ప్రకటించింది. మునుపెన్నడూ లేనట్లు తీవ్ర నిర్బంధం అమలు చేయడంతో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అయింది. ఈ నేపథ్యంలో కీలక నేతలు ఉద్యమాన్ని వదిలి ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. మరికొందరు అగ్రనేతలు పోలీసు ఎన్ కౌంటరులో అసువులు బాశారు. కొద్ది నెలల క్రితం మావోయిస్టు కేంద్ర కమిటీ నేత మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లొంగుబాటు సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్ జీ లొంగిపోవడంతో ఉద్యమాన్ని నడిపే నాథుడే కరువైనట్లు వ్యాఖ్యానిస్తున్నారు.

మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మరణం తర్వాత దేవ్ జీ పార్టీ బాధ్యతలు స్వీకరించారు. ఆపరేషన్ కగార్ కొనసాగుతుండగానే ఆయన పార్టీ బాధ్యతలు భుజానకెత్తుకున్నారు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత దేవ్ జీ లక్ష్యంగా బలగాలు పావులు కదిపాయి. ఈ క్రమంలోనే గత ఏడాది నవంబరులో దేవ్ జీ విజయవాడలో పోలీసులకు చిక్కినట్లు ప్రచారం జరిగింది. విజయవాడ, ఏలూరు, కాకినాడల్లో తలదాచుకున్న సుమారు 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో దేవ్ జీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉన్నట్లు అప్పట్లో పోలీసులు ప్రకటించారు.

అయితే అప్పట్లో దేవ్ జీ అరెస్టుపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. కానీ దేవ్ జీ సురక్షితంగా ఉన్నట్లు మావోయిస్టులు ప్రకటించడంతో ఈ వదంతులకు ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇక తాజాగా దేవ్ జీ లొంగుబాటులో ఉద్యమం చివరి దశకు చేరుకున్నట్లు భావిస్తున్నారు. దేవ్ జీతోపాటు కీలక నేత మల్లా రాజిరెడ్డితోపాటు మరో 16 మంది లొంగిపోయారన్న వార్తలతో మావోయిస్టు ఉద్యమం పరిసమాప్తమైనట్లే అంటున్నారు.

గత ఏడాది మావోయిస్టు పార్టీ బాధ్యతలు చేపట్టిన దేవ్ జీ తెలంగాణలోకి జగిత్యాల జిల్లా కోరుట్ల. 1982లో విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితులైన తిరుపతి అప్పట్లోనే నక్సల్ ఉద్యమం కోసం అడవి బాట పట్టారు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1993-94 ప్రాంతంలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా ఎంపికయ్యారు. మావోయిస్టు పార్టీలో నక్సలైట్లు విలీనం అయిన తర్వాత దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసిన తొలి దళానికి తిరుపతి కమాండర్ గా పనిచేసినట్లు చెబుతున్నారు. తిరుపతికి దేవ్ జీతోపాటు అనేక మారుపేర్లతో పిలుస్తారు. సంజీవ్, చేతన్, సుదర్శన్, రమేష్ వంటి పేర్లతో తిరుపతి పనిచేశారు.

Tags:    

Similar News