రేవంత్ కు సిట్ నోటీసులు.. అందలేదన్న ఫైర్ బ్రాండ్

Update: 2023-03-20 19:00 GMT
ఓపక్క ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవిత పాత్రపై పలు ఆరోపణలు రావటం.. తాజాగా ఈడీ విచారణను ఎదుర్కొంటున్న వేళలోనే.. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ ఉదంతం బయటకు రావటం.. అందులో సీఎం కేసీఆర్ కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ పేషీకి సంబంధం ఉందంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

రేవంత్ చేసిన ఆరోపణల్లో మరో ముఖ్యమైన అంశం ఒకే మండలానికి చెందిన వంద మందికి ర్యాంకులు వచ్చాయని పేర్కొన్నారు. సదరు మండలం.. ర్యాంకులు వచ్చిన వారి వివరాల్ని తమకు అందజేయాలని సిట్ నోటీసులు ఇస్తూ ప్రకటనను విడుదల చేసింది. రేవంత్ చేసిన ఆరోపణల్లో మరో ముఖ్యమైనది లీకేజీ ఉదంతానికి సంబంధించి ఇప్పటికే అరెస్టు అయిన రాజశేఖర్ కు టీఎస్ పీఎస్సీలోజాబ్ వచ్చేలా చేసింది కూడా కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందన్న వాదనలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

ఇలా పేపర్ లీకేజీకి సంబంధించి పలు అంశాల్నిప్రస్తావించిన రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మంత్రి కేటీఆర్ పేషీలో పీఏగా పని చేసే తిరుపతికి ఈ స్కాంతో సంబంధం ఉందని చెప్పటమే కాదు.. పలు తీవ్రమైన ఆరోపణల్ని చేశారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. మీడియాలో వస్తున్న రీతిలో తనకు సిట్ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని పేర్కొన్నారు.

అంతేకాదు.. సిట్ ఇచ్చే నోటీసులకు తాను భయపడనని చెప్పిన ఆయన.. సిట్ కు తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వనని చెప్పారు. సిట్టింగ్ జడ్జితో లీకేజీల అంశంపై విచారణ జరిపించాలని.. అప్పుడే తాను ఆధారాల్ని సమర్పిస్తాననని పేర్కొన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పిన ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ గద్దె దిగే వరకు తమ పోరాటం తప్పదన్నారు. ఈ కేసును కావాలనే నీరుకారుస్తున్నట్లుగా మండిపడ్డారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News