ఇలా చేస్తే ప్రధాని మోడీతో నేరుగా మాట్లాడే ఛాన్స్.. ఏం చేయాలంటే?

దేశ ప్రధానులుగా మోడీకి ముందు పలువురు పని చేసినా.. వారికి భిన్నంగా వ్యవహరిస్తుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.;

Update: 2025-12-22 07:39 GMT

దేశ ప్రధానులుగా మోడీకి ముందు పలువురు పని చేసినా.. వారికి భిన్నంగా వ్యవహరిస్తుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తనకు ఏ మాత్రం అవకాశం లభించినా దేశ ప్రజలతో మాట్లాడేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. ఇందుకు తగ్గట్లే ఆయన చేపట్టిన కార్యక్రమాలు కనిపిస్తాయి. చాయ్ పే చర్చా కావొచ్చు.. మన్ కీ బాత్ కావొచ్చు.. ఈ తరహాలోనే ఆయన కార్యక్రమాలు ఉంటాయి. పరీక్షల సీజన్ దగ్గరకు వస్తున్న వేళ.. ఎంపిక చేసిన విద్యార్థులతో మాట్లాడేందుకు ప్రధాని మోడీ సిద్ధమవుతున్నారు.

పరీక్షల వేళ విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడికి మాయం చేసేందుకు వీలుగా.. వారిలో స్ఫూర్తిని నింపేందుకు ఆయన పరీక్షా పే చర్చ పేరుతో కార్యకర్రమాన్ని నిర్వహిస్తుండటం తెలిసిందే. కొత్త సంవత్సరంలో మొదలు కానున్న పరీక్షల సీజన్ వేళ.. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల్లో పలువురితో మోడీ మాట్లాడనున్నారు. ప్రధానితో నేరుగా మాట్లాడేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకునే వీలు కల్పిస్తున్నారు.

ఇందుకు ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవటం.. లేదంటే వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది కేంద్ర మానవవనరుల శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తొమ్మిదో ఎడిషన్ కింద మరోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ప్రదాని మోడీ మాట్లాడతారు.

ఈ ప్రోగ్రాం అసలు ఉద్దేశం.. వారిలో ఉన్న పరీక్షల భయాన్ని పోగొట్టటం.. స్ఫూర్తిని నింపటం.. పరీక్షల వేళ ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పేలా చేయటమని చెప్పాలి. ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తిని చూపుతూ లక్షలాది మంది తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఆన్ లైన్ లో పేర్లను నమోదు చేసుకునేందుకు జనవరి 11 వరకు అవకాశం ఉంది. ప్రధాని మోడీతో నిర్వహించే పరీక్షా పే చర్చలో పాల్గొనేందుకు ఆరో తరగతినుంచి ప్లస్ టూ విద్యార్థుల వరకు అర్హులు.

‘‘https://innovateindia1.mygov.in" వెబ్ సైట్ ను క్లిక్ చేస్తే.. మొయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో విద్యార్థి వయసు.. టీచర్.. పేరెంట్స్ అన్న వివరాల్ని నమోదు చేయాల్సి ఉంటుంది. వాటిల్లో ఎంటర్ కాగానే మొబైల్ నంబరును.. జీ మొయిల్ ఖాతా వివరాల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓటీపీతో లాగిన్ అయి క్లిక్ చేస్తే.. విద్యార్థులు నేరుగా ఫోన్ నెంబరు.. జీమొయిల్ తో చేయొచ్చు. లేదంటే ఉపాధ్యాయుల లాగిన్ ద్వారా చేసే వెసులుబాటు ఇచ్చారు. వివరాల్ని ఎంటర్ చేసిన తర్వాత థీమ్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అంశానికి సంబంధించి 500 వ్యాక్యాల్లో వివరించాలి. పరీక్షా పే చర్చకు ఎంపికయ్యే సుమారు 2 వేల మంది విద్యార్థులకు కేంద్ర మంత్రిత్వ శాఖ పీపీసీ కిట్లను బహుమతిగా ఇస్తాయి. సో.. పిల్లల్లో కొత్త స్ఫూర్తిని నింపేందుకు ఉపయోగపడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News