200 సీట్ల కంటే ఎక్కువ గెలుస్తాం.. సజ్జల మాటలో అసలు లెక్క ఇదే

కొద్ది కాలంగా వార్తల్లో పెద్దగా కనిపించని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామక్రిష్ణారెడ్డి.. జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేళ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.;

Update: 2025-12-22 08:08 GMT

కొద్ది కాలంగా వార్తల్లో పెద్దగా కనిపించని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామక్రిష్ణారెడ్డి.. జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేళ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 200 స్థానాల కంటే ఎక్కువే గెలుచుకుంటుందన్నారు. అదేంటి? ఏపీలో ఉన్నది 175 అసెంబ్లీ స్థానాలైతే.. 200 ప్లస్ సీట్లు ఎలా సాధిస్తారన్న సందేహం అక్కర్లేదు. ఎందుకుంటే.. సజ్జల ఏదో ఆషామాషీగా వ్యాఖ్యలు చేయలేదు.

రాష్ట్ర విభజన వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డీలిమిటేషన్ జరగాల్సి ఉంది. అదే జరిగితే.. ఇప్పుడున్న అసెంబ్లీ స్థానాలకు మించి భారీగా స్థానాలు పెరగనున్నాయి. ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకొని సజ్జల వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ డీలిమిటేషన్ అన్నది జరగనిపక్షంలో 151 సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని పదిహేనేళ్లు నుంచి ఇరవై ఏళ్ల ముందుకు తీసుకెళ్లామన్న ఆయన.. మరోసారి అధికారం చేతికి వస్తే 30 ఏళ్ల డెవలప్ మెంట్ ను ఐదేళ్లలో చూపిస్తామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు ప్రజలే వైసీపీ చేతికి అధికార పగ్గాలు ఇస్తారన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. వైసీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకల్ని నిర్వహించిన సందర్భంగా ఆయన మరిన్ని వ్యాఖ్యలు చేశారు.

సమకాలీన రాజకీయ చరిత్రలో తల ఎగరేసుకుని పొగడాల్సిన నాయకుడు జగన్ గా పేర్కొన్న సజ్జల.. తమ ఐదేళ్ల పాలనలో ఐదు దశాబ్దాల్లో జరగాల్సిన డెవలప్ మెంట్ ను చేసి చూపించినట్లుగా పేర్కొన్నారు. ప్రజలు తమ తలరాతల్ని తామే రాసుకునేలా చేశారని.. అప్పు తెచ్చి పంచలేదన్నారు. ఏపీలోనే కాదు దేశ రాజకీయాల్లోనూ జగన్ కీలక పాత్రను పోషిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లారన్నారు. మొత్తంగా.. జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సజ్జల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమైనట్లుగా చెప్పాలి.

Tags:    

Similar News