ఏడాదిలో ఏపీలో సైబర్ నేరస్తులు దోచేసింది అంత భారీగా

గతంలో పరిమితంగా ఉండే ఈ సైబర్ దోపిడీ.. ఇటీవల కాలంలో అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పుడది మరింత ఎక్కువైంది.;

Update: 2025-12-22 10:30 GMT

సైబర్ దొంగల దారుణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సాంకేతికత పెరిగే కొద్దీ.. కంటికి కనిపించని వారు.. ప్రజల్లో ఉండే చిన్నపాటి బలహీనతల్ని అసరాగా చేసుకొని దారుణంగా దెబ్బ తీస్తున్నారు. రెట్టింపు లాభాల ఆశతో కొందరు.. అవగాహన లేని కారణంగా మరికొందరు తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. గతంలో పరిమితంగా ఉండే ఈ సైబర్ దోపిడీ.. ఇటీవల కాలంలో అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పుడది మరింత ఎక్కువైంది.

దేశంలో డిజిటిలైజేషన్ పెరగటం. ప్రతి ఒక్కరు తమ ఆర్థిక కార్యకలాపాల్ని చేతిలో ఇమిడిపోయే ఫోన్ల ద్వారా చేయటంతో.. సైబర్ దొంగల తెలివికి సామాన్యులు పెద్ద ఎత్తున చిత్తు అవుతున్నారు. ఎప్పటికప్పుడు తమ వ్యూహాల్ని మార్చుకుంటూ.. దోపిడీనే లక్ష్యం చేస్తున్న సైబర్ దొంగల కారణంగా సామాన్యుల సొమ్ము ఎంత భారీగా పోగొట్టుకుంటున్నారన్న విషయానికి సంబంధించిన గణాంకాలు తాజాగా వెల్లడయ్యాయి. ఏపీలోని ప్రతి గంటకు రూ.8.54 లక్షల మొత్తాన్ని సైబర్ దొంగలు దోచుకుంటున్నట్లుగా లెక్కలు తేల్చారు

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రూ.751 కోట్ల భారీ మొత్తాన్ని సైబర్ దొంగలు దోచేశారు. ఇదంతా అధికార లెక్కలు. అనధికారికంగా అంటే.. పోలీసులకు ఫిర్యాదుల రూపంలో రానికి భారీగా ఉంటున్నాయి. తాజాగా చెబుతున్న లెక్కలు కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో ఈ ఏడాదిలో ఏపీ నుంచి నమోదైన ఫిర్యాదుల ఆధారంగా ఈ భారీ మొత్తాన్ని పోగొట్టుకుంటున్న విషయాన్ని లెక్క తేల్చారు.

ఈ పోర్టల్ కు ఏపీ నుంచి 57వేలకు పైగా ఫిర్యాదులు అందినట్లుగా చెబుతున్నారు. సైబర్ దోపిడీదారుల కారణంగా ఏపీ వ్యాప్తంగా ప్రతి రోజు రూ.2.05 కోట్లు పోగొట్టుకుంటున్న వైనాన్ని గుర్తించారు. సైబర్ దొంగల దోపిడీని కట్టడి చేయటంలో పోలీసులు పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. బాధితుల నుంచి సైబర్ నేరగాళ్లు రూ.751 కోట్లు కొల్లగొడితే.. అందులో రూ.2.21 కోట్ల మొత్తాన్ని మాత్రమే అధికారులు తిరిగి తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. అంటే దోచుకున్న దానిలో అధికారులు కేవలం 0.29 శాతం సొమ్మును మాత్రమే రికవరీ చేయటం గమనార్హం. కాకుంటే రూ.89 కోట్ల మొత్తాన్ని మాత్రం బ్యాంకు ఖాతాల్లో స్తంభింపజేశారు.

బాధితులకు ఈ మొత్తం అందేందుకు సమయం పడుతుందని చెబుతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడే ముఠాలు అధికంగా విదేశాల్లో ఉంటూ తమ తరఫున ఆపరేటర్లను మన దేశంలో నియమించుకొని దోపిడీకి పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తంగా చూస్తే.. అంతకంతకూ పెరుగుతున్న సైబర్ దోపిడీకి కేంద్రంతో పాటు రాష్ట్రాలు సీరియస్ గా తీసుకొని చెక్ చెప్పే చర్యల్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News