ఇంత కక్కుర్తా? కీలక బాధ్యత అప్పజెబితే రూ.2 కోట్లు కొట్టేసుడా?

అత్యున్నత స్థాయిలో పని చేసే అవకాశాలు అందరికి రావు. టాలెంట్ ఎంతో మందికి ఉన్నా.. ఛాన్సులు కొందరికే దక్కుతుంటాయి.;

Update: 2025-12-22 09:30 GMT

అత్యున్నత స్థాయిలో పని చేసే అవకాశాలు అందరికి రావు. టాలెంట్ ఎంతో మందికి ఉన్నా.. ఛాన్సులు కొందరికే దక్కుతుంటాయి. అలా చేతికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జీవితంలోనూ.. కెరీర్ లోనూ ఎదగొచ్చు. అందుకు భిన్నంగా కక్కుర్తిని ప్రదర్శిస్తే మొదటికే మోసం రావటం ఖాయం. ఇప్పుడు చెప్పే ఉదంతం ఈ కోవకు చెందింది. జెనీవాలోని భారత శాశ్విత కమిషన్ లో పని చేసే అధికారి చేతివాటాన్ని ప్రదర్శించి రూ.2కోట్లు కొట్టేసిన కక్కుర్తి తాజాగా వెలుగు చూసింది.

అతడి ఘనకార్యాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు అతడిపై కేసును నమోదు చేశారు. అతడ్ని.. అతడి కుటుంబాన్ని భారత్ కు పంపించేశారు. చేస్తున్న ఉద్యోగం పోయి.. ఇప్పుడు తీరని తలవంపులను కొని తెచ్చుకున్న వైనం షాక్ కు గురి చేస్తోంది. జెనీవాలోని భారత శాశ్విత కమిషన్ లో మోహిత్ అనే అధికారి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా గత ఏడాది డిసెంబరులో విధుల్లో చేరాడు.

భారత కార్యాలయానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ లో అకౌంట్లు ఉన్నాయి. ఈ లావాదేవీల నిర్వహణ బాధ్యతల్ని అతనికి అప్పజెప్పారు. చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ లను ఉపయోగించే క్రమంలో.. కక్కుర్తిని ప్రదర్శించాడు. కొన్ని నకిలీ క్యూర్ కోడ్ లను క్రియేట్ చేసిన మోహిత్ సొంత ఖాతాలకు మళ్లించినట్లుగా గుర్తించారు. ఈ తరహాలో ఏడాది వ్యవధిలో రూ.2కోట్ల మొత్తాన్ని కొట్టేశాడు.

ఈ మోసాన్ని గుర్తించిన అధికారులు అతడ్ని ప్రశ్నించగా.. విధి లేని పరిస్థితుల్లో తాను చేసిన మోసాన్ని అంగీకరించాడు మోహిత్. తాను కొట్టేసిన నిధుల్ని క్రిప్టో గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు మళ్లించినట్లుగా ఒప్పుకున్నాడు. దీంతో అతడిపై సీబీఐ కేసు నమోదు చేసింది. అతడ్ని.. అతడి కుటుంబాన్ని భారత్ కు పంపేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో నేరపూరిత ద్రోహం.. ఫోర్జరీ.. ఖాతాల దుర్వినియోగం.. అవినీతి నిరోదక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కక్కుర్తి కోసం కుటుంబాన్ని బలి తీసుకునే ఇలాంటోళ్లు మంచి కెరీర్ ను చేజేతులారా నాశనం చేసుకుంటారనటానికి మోహిత్ లాంటోళ్లు పెద్ద ఉదాహరణగా నిలుస్తుంటారు.

Tags:    

Similar News