వామ్మో.. ఇదేం అభిమానం? పుట్టిన రోజున పొట్టేలు రక్తంతో జగన్ ఫోటోకు అభిషేకం

గుండెల్లో ఉన్న అభిమానాన్ని సందర్భానికి తగినట్లుగా ప్రదర్శించటం తప్పేం కాదు. తమకున్న ఇష్టాన్ని.. ఆరాధన భావాన్ని నలుగురికి చూపించాలని తపించటాన్ని కూడా తప్పుపట్టలేం.;

Update: 2025-12-22 07:47 GMT

గుండెల్లో ఉన్న అభిమానాన్ని సందర్భానికి తగినట్లుగా ప్రదర్శించటం తప్పేం కాదు. తమకున్న ఇష్టాన్ని.. ఆరాధన భావాన్ని నలుగురికి చూపించాలని తపించటాన్ని కూడా తప్పుపట్టలేం. అయితే.. అందుకు కొన్ని హద్దులు ఉంటాయన్న విషయాన్ని కొందరు మర్చిపోతుంటారు. తాము అభిమానించే వారిని సైతం తమ తీరుతో ఇబ్బందుల్లో పడేస్తుంటారు. తాజాగా అలాంటి సీన్ చోటు చేసుకుంది. వైసీపీ అధినేత.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఏపీ వ్యాప్తంగా వేడుకల్ని నిర్వహించారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ జగన్ మీద అభిమానాన్ని ప్రదర్శించారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోటలో వైసీపీ నేతల నిర్వాకం మాత్రం అతి స్థాయిని దాటేసి.. మరీ ఇంతలా చేయాల్సిన అవసరం ఉందా? అన్నదిప్పుడు చర్చగా మారింది. వీరు ప్రదర్శించిన అభిమానం లెక్క తెలిస్తే మాత్రం కాస్తంత కంగారు పడాల్సిందే. ఎందుకంటే.. వారి తీరు అలా ఉంది మరి. తమ అభిమాన నేత పుట్టిన రోజును పురస్కరించుకొని.. వేట కొడవళ్లతో పొట్టేళ్ల తలలు నరికి.. వాటి రక్తంతో జగన్ ఫోటోతో పాటు.. వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫోటోకు అభిషేకం చేసిన వైనం విస్మయానికి గురి చేసింది.

ఇదే తరహాలో రక్త వేడుకల్ని అనంతపురం జిల్లా విడపనకల్లులోనూ ప్రదర్శించారు. పుట్టినరోజు వేడుకల వేళ.. మరీ ఇంతలా జంతు రక్తాన్ని పారించాల్సిన అవసరం ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ తరహా అభిమానం కొందరు కనెక్టు కావొచ్చు. కానీ.. ఎక్కువమంది మాత్రం ఇలాంటి విపరీతాల్ని అంగీకరించరన్నది మర్చిపోకూడదు.ఇదిలా ఉంటే..ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జగన్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన వేడుకలు శ్రుతి మించినట్లుగా విమర్శలు ఎదురయ్యాయి.

దీనికి కారణం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయటం వరకు ఓకే. ఆసుపత్రిలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం.. జై జగన్ అంటూ కేకలు.. ఈలలు వేస్తూ చేసిన రచ్చతో ఆసుపత్రిలోని పలువురు రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీంతో.. వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ స్వామిదాస్ తో పాటు మరో ఇరవై మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఈ అంశంపై వైసీపీ వర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News