గణతంత్ర వేడుకలు .. రాజ్‌పథ్‌ లో రాష్ట్రపతి , విజయవాడలో గవర్నర్ !

Update: 2021-01-26 05:03 GMT
దేశంలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణతంత్ర వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఇప్పటికే దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. కాగా, మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 దినానికి గౌరవ సూచకంగా గణతంత్ర దినోత్సవం ప్రతి ఏడాది కూడా జరుపుకుంటున్నాము. ఈ రోజున బ్రిటీషు కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.  

72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ భారత ప్రజలందరికీ రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు. జై హింద్‌’ అంటూ ఆయన తన ట్వీట్‌ చేశారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించే పరేడ్‌ ను దృష్టిలో ఉంచుకొని దేశరాజధాని ఢిల్లీలో భద్రతా దళాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఐటీఓ, యమునా వంతెన తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ను క్రమబద్ధీకరించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

రాజ్‌పథ్‌ లో జరుగనున్న గణతంత్ర వేడుకల్లో భాతర సైనిక శక్తి, సాంస్కృతిక వైవిధ్యం, దేశ  సాంఘిక, ఆర్థిక ప్రగతి ప్రతిబింబించేలా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 17వ సైనిక పటాలాలు, 9 వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన పటాలాలు, కేంద్ర  పారామిలటరీ బలగాలు, 9 భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బలగాలు గణతంత్ర పరేడ్ ‌లో పాల్గొనున్నాయి. జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన అనంతరం ప్రధాని మోదీ పరేడ్ ‌ను ప్రారంభించనున్నారు.

ఇక , రాజ్‌పథ్‌ లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్  త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. గతేడాది 1,50,000 మంది గణతంత్ర వేడుకలకు హాజరుకాగా.. ఈ సారి కరోనా కారణంగా 25వేల మందికి మాత్రమే అనుమతించారు. ఇక మీడియా ప్రతినిధుల సంఖ్య 300 నుంచి 200కు తగ్గింది. ఇక, విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో 72వ గణతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించగా, సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఆ తర్వాత  గవర్నర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ  వేడుకల్లో భాగంగా పరేడ్ చేసిన వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 14 శకటాలు ప్రజలను ఆకర్షించాయి. 
Tags:    

Similar News