కరోనా నుంచి కోలుకున్న తర్వాత షాకింగ్ సమస్య వెలుగులోకి

Update: 2021-08-13 04:25 GMT
మాయదారి కరోనా విసురుతున్న సవాళ్లు ఒక పట్టాన తగ్గట్లేదు. ఎప్పటికప్పుడు ఈ వైరస్ కారణంతో ఎదురయ్యే సరికొత్త ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా అలాంటి అంశానికి సంబంధించిన ఒక అధ్యయనం బయటకు వచ్చింది. దాదాపు ఏనభై వేల మందిపై పరిశోధన జరిగిన బ్రిటన్ కు చెందిన ఇంపీరియల్ కాలేజీ లండన్ శాస్త్రవేత్తలు షాకింగ్ అంశాల్ని వెల్లడించారు.

కరోనా సోకిన వేళ ఆరోగ్య సమస్యలు ఒక ఎత్తు అయితే.. దాని నుంచి కోలుకున్న తర్వాత కూడా పలు రకాల ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. వీటికి సంబంధించిన వివరాల్ని సేకరించేందుకు తాజాగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన పరీక్షల్లో.. పాల్గొన్న వారిలో కొవిడ్ తక్కువగా సోకిన వారు.. తీవ్రత ఎక్కువగా ఉన్న వారున్నారు. తీవ్ర స్థాయిలో కొవిడ్ బారిన పడిన వారికి సంబంధించి కొత్త విషయం వెలుగు చేసింది.

ఈ ఆన్ లైన్ పరీక్షలో కొవిడ్ తీవ్రస్థాయిలో వచ్చిన వారంతా తక్కువ మార్కులు తెచ్చుకున్నట్లుగా గుర్తించారు. ముఖ్యంగా వీరంతా లాజికల్ క్వశ్చన్లకు సమాధానాలు ఇచ్చే విషయంలో తీవ్రమైన ఇబ్బందులకు గురైనట్లుగా గమనించారు. తమకు అందిన డేటా మీద మరింత లోతుగా అధ్యయనం చేసినప్పుడు.. ఆసుపత్రుల్లో చేరి వెంటిలేటర్ల సాయంతో శ్వాస పొందిన వారంతా.. విషయాల్ని గ్రహించటంలో ఇబ్బందులకు గురవుతున్నట్లుగా తేల్చారు.

వారిలో విషయ గ్రహణ నైపుణ్యంతో పాటు.. ఆలోచన.. ఏకాగ్రత విషయంలోనూ వారికి సమస్యలు ఎదురవుతున్నట్లుగా తేల్చారు. తగ్గిన ఏకాగ్రత.. విషయ గ్రహాక శక్తిని పాయింట్ల లెక్కలో చెప్పాలంటే ఐక్యూ సామర్థ్యంలో వారికి ఉండే దానిలో ఏడు పాయింట్ల మేర తగ్గినట్లుగా గుర్తించారు. ఈ సమస్యను చూసినప్పుడు.. కరోనా బారిన పడటం ఎంత ప్రమాదకరమన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.




Tags:    

Similar News