సిక్కోలులో టీడీపీ గెలుపుకు, వైసీపీ ఓటమికి అదే తేడా

Update: 2019-05-25 14:30 GMT
శుక్రవారం వేకువ జామున 4 గంటల వరకు తెగని శ్రీకాకుళం ఎంపీ ఎన్నిక టీడీపీ, వైసీపీని ఉత్కంఠ రేపింది. కేవలం 6653 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయింది. నిజానికి వైసీపీ గెలుస్తుందనుకున్న ఈ సీటు.. టీడీపీ వశం కావడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి.

శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాలున్నాయి. శ్రీకాకుళం, పాతపట్టణం, నరసన్నపేట, టెక్కలి , ఆముదాల వలస, ఇచ్చాపురంలో ఇచ్చాపురం నుంచి అశోక్, టెక్కలి నుంచి కింజారపు అచ్చెన్నాయుడు టీడీపీ తరుఫున గెలుపొందారు. మిగిలిన పలాస, ఆముదాలవలస, నరసన్నపేట, పాతపట్నం, శ్రీకాకుళం ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచారు. 5: 2 వైసీపీ, టీడీపీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాల నిష్పత్తి. ఈ నేపథ్యంలో ఈజీగా వైసీపీ ఎంపీ అభ్యర్థి గెలుస్తాడని అందరూ ఊహించారు.. ఇక్కడే ట్రైన్ రివర్స్ అయ్యింది.

టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడు గెలుపునకు.. వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఓటమికి ప్రధాన కారణం క్రాస్ ఓటింగ్. శ్రీకాకుళం ఎంపీ పరిధిలో ఐదు చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచినా ఆ ఓట్లు ఎంపీ దువ్వాడకు పడలేదు. మొత్తం 7 నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు 4,98,206 ఓట్లు పోలయ్యాయి. అయితే ఆశ్చర్యకరంగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు ఎక్కువగా 5,34,544 ఓట్లు పడ్డాయి. అంటే క్రాస్ ఓటింగ్ ద్వారా 36338 ఓట్లు అధికంగా టీడీపీ అభ్యర్థికి పడ్డాయి..ఇక వైసీపీ అభ్యర్థికి 527891 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో 6653 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి గెలవగా.. వైసీపీ అభ్యర్థి ఓడిపోయారు.

ఇక వైసీపీ అభ్యర్థి ఓడిపోవడంలో మరో కారణం కూడా ఉంది. అదే నోటా.. నోటాకు శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా 25545 ఓట్లుపడ్డాయి. ఇందులోంచి ఓ పదివేలు వైసీపీ అభ్యర్థికి పడినా ఆయన గెలిచి ఉండేవారు. ఇలా క్రాస్ ఓటింగ్, నోటా వైసీపీ అభ్యర్థిని ముంచాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఎంపీ రామ్మోహన్ నాయుడును గెలవగానే ఆయన బాబాయ్ అచ్చెన్నాయుడు కళ్లలో నీళ్లు తెచ్చుకొని గట్టిగా హత్తుకున్నారు. వైసీపీ మెజార్టీ ఎమ్మెల్యేలు గెలిచినా.. టీడీపీ ఎంపీ ఇక్కడ గెలవడం విశేషం.


Tags:    

Similar News