తిట్టినా కేసీఆర్‌ కు మోడీ టైమిచ్చింది అందుకేన‌ట‌!

Update: 2018-12-30 05:57 GMT
2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌య్యాక ప్ర‌ధాని మోడీ అపాయింట్ మెంట్ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌డిన ఆరాటం అంతా ఇంతా కాదు. అన్ని ఓకే చేసుకొని ఢిల్లీ కి వెళ్లిన త‌ర్వాత కూడా మోడీ స‌మ‌యం దొరికేది కాదు. దీంతో మారు మాట్లాడ‌కుండా ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు కామ్ గా వ‌చ్చేసేవారు. ఒక‌సారైతే కేర‌ళ‌లో ఒక వ్యాపార‌వేత్త ఇంట్లో జ‌రిగిన పెళ్లికి వెళ్లి నేరుగా ఢిల్లీకి వెళ్లారు కేసీఆర్‌. ఆ సంద‌ర్భంలో కూడా మోడీ మాష్టారు టైమిచ్చార‌ని ఆయ‌న అంత శ్ర‌మ తీసుకొని ఢిల్లీకి వెళ్లినా.. ప్ర‌ధాని షెడ్యూల్ చాలా టైట్ గా ఉంద‌ని.. క‌ల‌వ‌టం సాధ్యం కాద‌న్న మాట‌తో కేసీఆర్ వెన‌క్కి వ‌చ్చేసిన ప‌రిస్థితి.

ఎందుకిలా అంటే.. 2014 ఎన్నిక‌ల్లో మోడీని కేసీఆర్ ఘాటుగా విమ‌ర్శించ‌ట‌మే. మోడీ హ‌వా దేశం మొత్తం న‌డుస్తున్న వేళ‌.. ఆయ‌న్ను తీవ్రంగా విమ‌ర్శించిన అతి కొద్దిమందిలో కేసీఆర్ ఒక‌రు. త‌న‌ను త‌ప్పు ప‌ట్టేవారి విష‌యంలో మోడీ ఎంత క‌ర‌కుగా ఉంటారో తెలిసిందే. అదే విష‌యాన్ని తెలంగాణ ముఖ్య‌మంత్రికి అర్థ‌మ‌య్యేలా చేశారన్న మాట ఢిల్లీలో త‌ర‌చూ వినిపించేది.

క‌ట్ చేస్తే.. తాజాగా జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని మోడీపై కేసీఆర్ విమ‌ర్శ‌లు చేశారు. బాబుతో పోలిస్తే కేసీఆర్ ప్ర‌భుత్వం సూప‌ర్ అంటూ పొగిడేసిన మోడీ.. అందుకు భిన్నంగా మాట్లాడ‌టం.. దానికి కౌంట‌ర్ గా కేసీఆర్ బ‌దులు ఇవ్వ‌టం లాంటివి జ‌రిగాయి. మొత్తంగా చూసిన‌ప్పుడు మోడీ వ‌ర్సెస్ కేసీఆర్ అన్న రీతిలో కొన్ని విమ‌ర్శ‌లు న‌డిచాయ‌ని చెప్పాలి. ఎన్నిక‌ల మొద‌ట్లో కేసీఆర్ మిత్ర‌ప‌క్షంగా బీజేపీ ఉంద‌ని.. అప్ర‌క‌టిత మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న మాట వినిపించింది. దీనికి త‌గ్గ‌ట్లే బీజేపీ సిట్టింగ్ స్థానాల్లో బ‌ల‌హీన‌మైన అభ్య‌ర్థుల్ని కేసీఆర్ బ‌రిలో ఉంచార‌న్న ప్ర‌చారం న‌డిచింది. ఫ‌లితాలు మాత్రం అందుకు భిన్నంగా వ‌చ్చాయి.

దీనిపై తెలంగాణ బీజేపీ నేత‌లు లోగుట్టుగా మాట్లాడుతూ.. మోడీ.. కేసీఆర్‌ లు ఇద్ద‌రూ క‌లిసి త‌మ‌ను ముంచేశార‌న్న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. ఈ మాట‌ను తాము బ‌య‌ట‌కు చెప్ప‌లేమంటూ త‌మ స‌న్నిహితుల వ‌ద్ద భోరుమ‌నే ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. 2014కు భిన్నంగా తాజా ఎన్నిక‌లు ముగిసి.. ఎమ్మెల్యేలు ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌క‌ముందే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో ప‌లు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించిన కేసీఆర్‌.. చివ‌రి మ‌జిలీగా ఢిల్లీకి వెళ్లారు. ప్ర‌ధాని మోడీని క‌లిసి దాదాపు గంట‌న్న‌ర సేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు.

వీరి భేటీకి రెండు వారాల ముందు ఘాటుగా ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకొని.. మ‌ళ్లీ క‌ల‌వ‌టం ప‌లువురి దృష్టిని ఆక‌ర్షించింది. అదే స‌మ‌యంలో మోడీ ముందు కేసీఆర్ వంగిపోయిన తీరును ప‌లువురు ప్ర‌స్తావించ‌టం క‌నిపించింది. వీరి భేటీ ఎందుక‌న్న ప్ర‌శ్న‌ను కొంద‌రు వేస్తే.. దానికి బ‌దులుగా మోడీ సాబ్ ముందు కేసీఆర్ పెట్టిన విన‌తుల చిట్టాను చూపించినా.. తెర వెనుక జ‌రిగింది వేర‌న్న మాట వినిపించింది. అదేమిట‌న్న విష‌యం తాజా కేసీఆర్ ప్రెస్ మీట్  ద్వారా లోకానికి అర్థ‌మైన‌ట్లేన‌ని చెప్పక త‌ప్పదు. త‌న‌ను అదే ప‌నిగా విమ‌ర్శిస్తున్న బాబుకు చెక్ పెట్టేందుకు వీలుగా ఆయ‌న్ను బండ‌కేసి బాదేసిన‌ట్లుగా తిట్టేసే కేసీఆర్‌ ను రంగంలోకి దించిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ కార‌ణంతోనే ఎన్నిక‌ల వేళ త‌న‌ను అంత‌గా విమ‌ర్శించిన కేసీఆర్ మాట‌ల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోని మోడీ.. వెంట‌నే టైం ఇవ్వ‌ట‌మే కాదు.. ఏకాంతంగా ఎక్కువ స‌మ‌యాన్ని గ‌డిపిన‌ట్లుగా చెబుతున్నారు. దీనికి త‌గ్గ‌ట్లే తాజా ప్రెస్ మీట్లో కేసీఆర్ ఫోక‌స్ అంతా బాబు మీద‌నే ఉండ‌టం తెలిసిందే.

త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌ర్వాత తాను స్టార్ట్ చేసిన ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కంటే కూడా బాబును టార్గెట్ చేసిన‌ట్లుగా కేసీఆర్ మాట‌లున్నాయి. ఇదంతా చూసిన‌ప్పుడు .. ఢిల్లీలో మోడీతో భేటీ అస‌లు మ‌ర్మం ఇదేనా? అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు. త‌న‌పై అదే ప‌నిగా విమ‌ర్శ‌లు సంధిస్తున్న బాబు మాట‌ల‌కు తాను రియాక్ట్‌ కావ‌టం ద్వారా త‌న స్థాయిని మోడీ త‌గ్గించుకోవాలుకోవ‌టం లేద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంది. తాను చేయాల్సిన ప‌నిని కేసీఆర్ చేత చేయించ‌ట‌మే మోడీ ప్లాన్ గా చెబుతున్నారు. తాజా ప‌రిణామాలు ఇందుకు త‌గ్గ‌ట్లే ఉండ‌టం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News