తమిళనాడు ఎందుకు తగలబడుతోంది..?

Update: 2017-01-23 10:04 GMT
అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకూ శాంతియుతంగా నడిచిన జల్లికట్టు బ్యాన్ నిరసనలు కాస్తా ఒక్కసారిగా హింసాత్మకంగా మారిపోయాయి. నిన్నమొన్నటివరకూ సంస్కృతి..సంప్రదాయం కోసం తమిళులు చేపట్టిన నిరసనలు దేశ వ్యాప్తంగా ఉద్యమస్ఫూర్తిని రగిలించటమే కాదు.. పలువురు మెరీనా బీచ్ తరహాలో ఆందోళనలకు పిలుపునివ్వటం తెలిసిందే.

గడిచిన వారం రోజులుగా ప్రశాంతంగా సాగిన నిరసనలు..ఉన్నట్లుండి ఒక్కసారిగా అదుపు తప్పాయి. మెరీనాబీచ్ ను ఖాళీ చేయాలంటూ ఆందోళనకారులపై పోలీసులు ఒత్తిడి చేయటం.. ఈ సమయంలో ఇరు పక్షాల మధ్య నడిచిన వాగ్వాదం.. ఆ పై చోటు చేసుకున్న పరిణామాలు పరిస్థితి మొత్తాన్ని మార్చేశాయి. మెరీనా బీచ్ కి సమీపంలోని ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్ కు ఆందోళనకారులు నిప్పుపెట్టేశారు. పెట్రోల్ బాంబులు విసిరారు. కారు.. ఆటో సహా దాదాపు 50కు పైగా వాహనాలకు నిప్పుపెట్టటంతో పరిస్థితి మొత్తం ఒక్కసారిగా మారిపోయింది.

ఆందోళకారులు చేసిన విధ్వంసంతో దాదాపు ఇరవై మందికి పైగా పోలీసులకు గాయాలు కావటంతో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగి.. నిరసనకారులపై టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో చెన్నై మహానగరంలో ఒక్కసారిగా భారీ ట్రాఫిక్ జాం చోటు చేసుకుంది. మెరీనా బీచ్ పరిసరాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.

ఆందోళనకారులు అదుపు తప్పటంతో పోలీసులు తమ లాఠీలకు పెద్ద ఎత్తున పని చెబుతున్నారు. నిరసనకారులు ఎక్కడ కనిపిస్తే అక్కడ విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉంటే.. హింసాత్మక ఘటనలు చెన్నై వరకే పరిమితం కాకుండా తమిళనాడులో పలు ప్రాంతాలకు వ్యాపించాయి. మధురై..తిరుచ్చి..లాంటి నగరాల్లోనూ విధ్వంసం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఉన్నట్లుండి ఇంతలా పరిస్థితి ఎందుకు అదుపు తప్పిందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

స్థానిక మీడియా వర్గాల కథనం ప్రకారం.. జల్లికట్టుపై విధించిన బ్యాన్ ను నిలిపివేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన నేపథ్యంలో ఆందోళనలు విరమించాలని ప్రభుత్వం కోరింది. అయితే.. ఆందోళనకారులు మాత్రం ఆర్డినెన్స్ మీద శాశ్విత పరిష్కారం కావాలంటూ పట్టు పట్టారు. ఇదిలా ఉంటే.. నిరసన ప్రదర్శనల్లోకి సంఘ విద్రోహక శక్తులు ప్రభుత్వం ఆరోపించింది. వెంటనే.. మెరీనా బీచ్ ను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది జరిగిన కాసేపటికే పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. పోలీసుల తీరుతోనే ఇలాంటి పరిస్థితి అని పలువురు ఆరోపిస్తుంటే.. శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమాన్ని నీరు కార్చేందుకే వ్యూహాత్మకంగా కొన్ని బయటి శక్తులతోనే ఇలాంటి హింస చెలరేగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News