చంద్రబాబూ.. నమ్మి కాదు అధికారం ఇచ్చింది

Update: 2015-09-01 18:24 GMT
గత ఎన్నికల్లో నవ్యాంధ్ర ప్రజలు తనను విశ్వసించి.. తన విశ్వసనీయతకు పట్టం కట్టి తనకు అధికారం ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ వ్యాఖ్యానిస్తున్నారు. తన విశ్వసనీయతకు గత ఎన్నికల్లో గెలుపే నిదర్శనమని కూడా చెబుతున్నారు. కానీ, వాస్తవం అందుకు పూర్తి భిన్నమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికలకు ముందు నవ్యాంధ్రలోని ఏ పార్టీనీ ప్రజలు విశ్వసించలేదు. కాంగ్రెస్ మీద కట్టలు తెగే ఆగ్రహాన్ని పెంచుకున్నారు. విభజనకు టీడీపీ కూడా కారణమని భావించారు. సోనియాతో జగన్ లాలూచీ పడ్డారని భావించారు. విభజనకు బీజేపీ కారణమని భావించారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, బీజేపీ ఎన్నికలకు వెళ్లాయి. టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుని వెళ్లాయి. అయితే, ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి రకరకాల కారణాలు పని చేస్తూ ఉంటాయి. గత ఎన్నికల్లో కూడా ఆ కారణాలన్నీ పని చేశాయి. దేశవ్యాప్తంగా మోదీ హవా నడుస్తోంది. టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో సీమాంధ్రలో కూడా కొంత శాతం మోదీ హవా పని చేసింది. టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగినా ఆ కూటమికి గెలుపు అవకాశాలు ఉన్నాయని ఏ సర్వేలోనూ బయటపడలేదు. అటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు.

అయితే, చంద్రబాబు ప్రకటించిన రుణ మాఫీ పథకం కొంత ప్రభావం చూపింది. అది వస్తే ఒక్కొక్కరికీ కనీసం లక్ష రూపాయలు వచ్చేస్తాయని ప్రతి ఒక్కరూ భావించారు. దీనికితోడు, టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతుగా పవన్ కల్యాణ్ రంగంలోకి దిగిన తర్వాత మొత్తం పరిస్థితి మారిపోయింది. కోస్తా జిల్లాల్లో దాదాపు 16 శాతం మంది కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. చిరంజీవిపై కోపం కావచ్చు.. తమకు మరొక నాయకుడు లేకపోవడం కావచ్చు.. మోదీ హవా తోడు కావడం కావచ్చు.. కాపులంతా పవన్ కల్యాణ్ పిలుపును అందుకుని టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికారు. రుణ మాఫీతోపాటు ఇది తీవ్రస్థాయిలో ప్రభావం చూపి నవ్యాంధ్రలో టీడీపీ ఘన విజయం సాధించడానికి, కోస్తా జిల్లాల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోవడానికి కారణమైందని, అంతే తప్ప అది చంద్రబాబు విశ్వసనీయ కాదని విశ్లేషకులు వివరిస్తున్నారు.
Tags:    

Similar News