బేగంపేట వెళ్లిన బాబు హకీంపేట వెళ్లలేదేం..?

Update: 2015-06-30 06:07 GMT
ఏడాది కిందట.. విభజన జరిగిన కొత్తల్లో హైదరాబాద్‌లో విడిది చేసేందుకు దేశ ప్రధమ పౌరుడు.. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హైదరాబాద్‌ రావటం తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన బేగంపేటలో ల్యాండ్‌ అయ్యారు. ఆయనకు స్వాగతం పలికేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. స్థానికంగా ఉన్న సీఎంగా కేసీఆర్‌కు మొదట స్వాగతం పలికే చాన్స్‌ వస్తే.. తర్వాత అవకాశం చంద్రబాబుకు దక్కింది.

తాజాగా మరోసారి రాష్ట్రపతి హైదరాబాద్‌కు వచ్చారు. గత ఏడాది మాదిరి బేగంపేటకు కాకుండా.. హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో విమానం దిగారు. ఆయనకు స్వాగతం పలకటానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. గవర్నర్‌.. త్రివిధ దళాలు వచ్చాయి. కానీ.. హైదరాబాద్‌లోనే ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం వెళ్లలేదు. ఎందుకు అన్న ప్రశ్న ఆసక్తికరంగా మారింది.

గత ఏడాది బేగంపేట వెళ్లిన చంద్రబాబు ఈసారి హకీంపేటకు వెళ్లకుండా.. ఆఫీసులో కూర్చొని అధికారులతో రివ్యూ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఏమిటంటే.. విభజన నిబంధనలే అని చెబుతున్నారు.

విభజన చట్టంలోని ఉమ్మడి రాజధాని అన్న దానికి నిర్వచనం ఏమిటంటే.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని. ఆ లెక్కన బేగంపేట ఉమ్మడి రాజధాని కిందకు వస్తే.. హకీంపేట మాత్రం అందుకు భిన్నంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ బయటకు వస్తుంది. ఈ కారణంతోనే రాష్ట్రపతి ప్రణబ్‌కు స్వాగతం పలికేందుకు చంద్రబాబు వెళ్ల లేకపోయారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిన నేపథ్యంలో.. రాష్ట్రపతికి స్వాగతం పలకటానికి ఆహ్వానం కూడా అందని పరిస్థితి. అందుకే.. బేగంపేటకు వెళ్లిన ముఖ్యమంత్రి హకీంపేటకు మాత్రం వెళ్లకుండా తన కార్యాలయంలోనే ఉండిపోయారు.

Tags:    

Similar News