సుడి అంటే మోత్కుపల్లిదేనా? పార్టీలోకి రాకుండానే పదవిని సిద్ధం చేసుకున్నారా?

Update: 2021-08-12 09:30 GMT
వ్యక్తిగత సమర్థత ఎంత ఉన్నప్పటికీ కాలం కలిసి రాకపోతే ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయాల్లో మాత్రం ‘కాలం’ పోషించే కీలక పాత్ర అంతా ఇంతా కాదు. ఇప్పుడు సీనియర్ నేత.. ఒకప్పుడు కేసీఆర్ కు సన్నిహితుడైన మోత్కుపల్లికి ఎట్టకేలకు సుడి తిరిగిపోయిందని చెప్పాలి. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ.. తర్వాత ఏ నోటితో అయితే కేసీఆర్ ను చావు తిట్లు తిట్టారో.. ఇప్పుడు అదే కేసీఆర్ ను విపరీతంగా పొగిడేస్తున్న ఆయనకు.. కీలక పదవిని అప్పజెప్పేందుకు రంగం సిద్ధమైనట్లు చెబుతున్నారు.

టీడీపీలో సుదీర్ఘకాలం పాటు కొనసాగి.. ఎలాంటి పదవులు లేక నీరసించిపోవటం.. అప్పుడప్పుడు సంచలన ప్రకటనలతో మీడియాలో కనిపించిన ఆయన.. టీడీపీకి గుడ్ బై చెప్పి.. బీజేపీలో చేరటం తెలిసిందే. హుజూరాబాద్ ఉప ఎన్నిక పుణ్యమా అని.. దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్.. ఇప్పుడా పథకాన్ని అమలు చేసేందుకువీలుగా మోత్కుపల్లికి ఛైర్మన్ గిరి ఇచ్చేందుకు సిద్ధమవుతున్టన్లు చెబుతున్నారు.

బీజేపీకి గుడ్ బై చెప్పిన మోత్కుపల్లి టీఆర్ఎస్ లో చేరనప్పటికి.. త్వరలో చేరనున్నట్లు చెబుతున్నారు. ఆయన పార్టీలోకి వచ్చి రావటంతోనే పదవిని అప్పజెప్పేస్తారని చెబుతున్నారు. గతంలోనూ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పార్టీలోకి రావటం రావటంతోనే మంత్రి పదవిని అప్పజెప్పిన వైనం గుర్తు చేసుకుంటే.. మోత్కుపల్లికి దళిత బంధు ఛైర్మన్ గా ఎంపిక చేయటం ఖాయమని చెబుతున్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో విపక్షాలతో పాటు కొత్తగా ఎదుగుతున్న రాజకీయ శక్తులకు చెక్ చెప్పేందుకు వీలుగా ఎస్సీ నేతను మంత్రివర్గంలోకి తీసుకుంటారని చెబుతున్నారు. ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ బీఎస్పీలోకి చేరటం.. దళితుల్ని సమీకరించే ప్రయత్నాన్ని షురూ చేయటం తెలిసిందే. అలాంటి వారికి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు.. ఖాళీగా ఉన్న కాబినెట్ స్థానాల్ని భర్తీ చేయాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

బాల్క సుమన్.. సండ్ర.. గువ్వల బాలరాజులో ఎవరో ఒకరికి మంత్రిపదవి ఖాయమని చెబుతున్నారు. దళితుల్లో మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఉంటుందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయం మొత్తం సామాజిక సమీకరణాలతో నిండి ఉంటుందన్న మాట వినిపిస్తోంది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు బ్యాంకు అధికంగా ఉన్న ఎస్సీలకు చేరువయ్యేలా దళితబంధుతో పాటు.. వారి సామాజిక వర్గానికి చెందిన వారికి పదవులు.. ఓటర్లలో తర్వాతి స్థానంలో ఉన్న బీసీ వర్గానికి చెందిన నేతను అభ్యర్థిగా నియమించటం ద్వారా సామాజిక సమీకరణను పక్కాగా పాటిస్తున్న కేసీఆర్ తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పక తప్పదు. ఏమైనా.. పదవులు వచ్చే కాలం అయిపోయిందనుకున్న మోత్కుపల్లికి దళిత బంధు పథకం పుణ్యమా అని సుడి తిరిగి పోయిందన్న మాట వినిపిస్తోంది.





Tags:    

Similar News