మోడీని కడిగేసిన ఎంపీ రాయపాటి

Update: 2015-08-01 07:40 GMT
ప్రత్యేక హోదా విషయం ఏపీలో నాయకులకు పెద్ద ఇబ్బందికర అంశంగా మారిపోయింది. ముఖ్యంగా టీడీపీ నేతల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కారణంతో కేంద్రంతో గొడవ పెట్టుకుంటే మిగతా విషయాల్లోనూ కేంద్ర సహకారం కోల్పోయే ప్రమాదముంటుందని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఆ కారణంగానే ఈ విషయంలో కేంద్రంతో కఠినంగా వ్యవహరించలేకపోతున్నారు. కేంద్రం పదేపదే ఏదోరకంగా ఇవ్వలేమని చెబుతున్నా గట్టిగా ఒక్క మాట కూడా అనలేని పరిస్థితిలో ఉన్నారు టీడీపీ నేతలు.

అయితే... లోలోపల మాత్రం వారిలో ఆవేదన, ఆవేశం మాత్రం తీవ్ర స్థాయిలో ఉంది.. అందుకే గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తే మాత్రం ఒక్కసారిగా బరస్ట్ అవుతున్నారు. తాజాగా ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా విలేకరుల ప్రశ్నలకు సహనం కోల్పోయి ప్రధాని మోడీపై ఫైరయిపోయారు.

    ఏపీ ప్రత్యేక హోదాపై రాయపాటిని విలేకరులు ప్రశ్నలు అడగడంతో ఆయన కాసేపు ఇబ్బందిపడ్డారు. వ్యతిరేకంగా మాట్లాడలేక, అలా అని మౌనంగా ఉండలేక ఇబ్బందిపడ్డారు. అయినా విలేకరుల ప్రశ్నల దాడి ఆగకపోవడంతో ఆయన ఒక్కసారిగా బరస్టయ్యారు. 'ప్రత్యేక హోదా కోసం ఇంకేం చేయాలి... బట్టలిప్పుకొని తిరగమంటారా... ఏం చేయాలి.. అసలు బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనుకోవడం లేదు' అంటూ ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు.

    అసలు ఈ పాపానికి బీజం వేసింది యూపీఏ.. ఇప్పుడు బీజేపీ కూడా ప్రత్యేక హోదా ఇవ్వకుండా మొండికేస్తోంది అంటూ ఆయన మండిపడ్డారు. అసలు ప్రధాని మోడీని కూడా తప్పుపట్టాల్సి ఉంటుందని.. ఆయన అసలు ఇండియాలో ఉండడం లేదని.. ఎప్పుడూ విదేశాల్లో తిరుగుతూ విజిట్ వీసాపై ఇండియా వస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా విషయం చివరకు బీజేపీ, టీడీపీ రెండు పార్టీలకూ చేటు చేసేలా ఉందని చెప్పారు. కాగా.... ప్రత్యేక హోదాపై పవన్ కల్యాన్ పోరాడితే ఆయనతో చేతులు  కలపడానికి తామంతా సిద్దమేనంటూ రాయపాటి ఓ కొత్త మాట చెప్పారు.
Tags:    

Similar News