వైసీపీ ఎంపీపై టీడీపీ ఎంపీ ఫిర్యాదు

Update: 2018-02-22 17:42 GMT
   
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఏఎస్ - ఐపీఎస్ అధికారులపై విపక్ష వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో టీడీపీ ఎంపీ రాయపాటి తీవ్రంగా స్పందించారు. ఈమేరకు ఆయన పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
    
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేయాలని డీజీపీ మాలకొండయ్యకు టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఫిర్యాదు చేశారు. ఐఏఎస్ సతీష్ చంద్రను సాయిరెడ్డి బెదిరించారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులకు పరువు నష్టం కలిగేలా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలున్నాయని... అధికారులను అవమానించేలా చేసిన వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాయపాటి  తన ప్రతినిధుల ద్వారా ఎంపీ రాయపాటి ఫిర్యాదును డీజీపీకి పంపించారు.
    
కాగా చంద్రబాబు కార్యాలయంలో ఐఏఎస్‌ అధికారి సతీష్‌ చంద్ర, ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  దీనిపై ఆయన ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. ఆ తరువాత కూడా విజయసాయిరెడ్డి వారిపై ఆరోపణలు చేయడంతో ఐఏఎస్‌ల సంఘం అభ్యంతరం వ్యక్తంచేసింది. అయితే... ఈ పరిణామాల అనంతరం సాయిరెడ్డి  మరో ఇద్దరు ఐఏఎస్‌లపైనా విమర్శలు చేశారు. ఆరోపణలకు ఆధారాలు కూడా ఉన్నాయని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆధారాలు బయటపెట్టాల్సిందిగా సదరు అధికారులు కోరితే వెంటనే వాటిని బయటపెడుతానని చెప్పారు. సతీష్‌ చంద్ర, ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు మరో ఇద్దరు ఐఏఎస్‌లు రాజమౌళి, సాయిప్రసాద్‌లు కూడా పక్షపాత ధోరణితో టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు.


Tags:    

Similar News