పవన్ కు బాసటగా చరణ్.. జనసేనలో జోష్

Update: 2019-04-07 06:46 GMT
ఏపీలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరిన వేళ మెగా ఫ్యామిలీ కదిలివస్తోంది. నిన్ననే తండ్రికి తోడుగా.. బాబాయ్ కి అండగా ప్రచారంలోకి మెగా హీరో వరుణ్ తేజ్ వచ్చాడు. ఇప్పుడు బాబాయ్ లకు బాసటగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ రంగంలోకి దిగుతున్నారు. జనసేన గెలుపు కోసం రాంచరణ్ ప్రచారం చేయనున్నారు. పవన్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో రాంచరణ్ పాల్గొంటారు. నాగబాబు తరుఫున కూడా రాంచరణ్ ప్రచారం చేస్తారు.

హైదరాబాద్ నుంచి శనివారం రాత్రి బయలు దేరిన రాంచరణ్ విజయవాడకు చేరుకున్నారు. అక్కడ నేరుగా బాబాయ్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇటీవల అస్వస్థతకు గురైన పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజకీయ వ్యూహాలు రచించి పవన్ కళ్యాణ్ వెంట రెండు రోజుల పాటు రాంచరణ్ ప్రచారం చేయనున్నట్టు జనసేన వర్గాలు తెలిపాయి. అంతేకాదు బాబాయ్ నాగబాబు తరుఫున కూడా రాంచరణ్ ప్రచారం చేయనున్నారు.

ఇక ఆదివారం, సోమవారం రాంచరణ్ పలు బహిరంగ సభల్లో కూడా పాల్గొంటారని జనసేన వర్గాలు తెలిపాయి.  ఎన్నికల ప్రచారానికి 3 రోజులే సమయం ఉన్ననేపథ్యంలో రాంచరణ్ ఎంట్రీ జనసేనలో కొత్త జోష్ నింపనుంది. వరుణ్ తేజ్ ఇప్పటికే తన తండ్రి నాగబాబు తరుఫున నర్సాపురంలో చుట్టేస్తున్నారు. నిహారిక కూడా తన తండ్రి కోసం ప్రచారం చేసింది.

ఇక మరో మెగా హీరో అల్లు అర్జున్ తను ప్రచారానికి రాకపోయినా తన మద్దతు నాగబాబు, పవన్ కు ఉంటుందని ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలా ఎన్నికల సమయం దగ్గర పడేసరికి మెగా హీరోలు అందరూ జనసేన పార్టీ తరుఫున రంగంలోకి దిగడం జనసైనికుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మరి మెగా హీరోల ప్రచారం  ఏమేరకు ప్రభావితం చేస్తుందో ఫలితాల తర్వాత చూడాలి మరి..
Tags:    

Similar News