రజనీ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు.. సారీ చెప్పాలంటూ మోతెక్కిస్తున్నారు

Update: 2023-05-01 09:47 GMT
సుదీర్ఘ కాలంగా సాగుతున్న స్నేహం నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల శంఖారావానికి హాజరు కావటం తెలిసిందే. ఈ సందర్భంగా తనకు అనిపించిన మాటల్ని మాట్లాడారు. తన స్ఫూర్తిదాతకు సంబంధించిన సంగతులతో పాటు.. తనకు చిరకాల స్నేహితుడైన చంద్రబాబు గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ పాలకపక్షం మీద కానీ.. ముఖ్యమంత్రి మీద కానీ కించిత్ విమర్శ చేసింది లేదు. ఇలాంటి వేళలో.. రజనీ మీద విరుచుకుపడాలన్నది వైసీపీ నేతల ఆలోచన అయితే.. అందుకు తగ్గట్లుగా మాట్లాడితే బాగుండేది.

ఎప్పటిలానే.. తమ నోటికి పని చెప్పే క్రమంలో వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడిన మాటలపై రజనీ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వంక పెట్టలేని వ్యక్తిత్వంతో ఉండే రజనీకి భారీగా అభిమానులు ఉండటం తెలిసిందే.

అలాంటి ఆయన్ను నోటికి వచ్చినట్లుగా మాటలు అనేసిన వైసీపీ నేతల విమర్శలపై విరుచుకుపడుతున్నారు. రజనీపై విమర్శలు చేసే క్రమంలో గీతలు దాటేసి వారిలో మాజీ మంత్రి కొడాలి నాని ముందుంటే.. ఆ తర్వాతి స్థానంలో మంత్రులు రోజా.. అంబటి రాంబాబు తదితరులు ముందున్నారు.

రాజకీయాల గురించి మాట్లాడే అర్హత రజనీకీ లేదని.. ఆయన తమిళనాడులో హీరో కావొచ్చు కానీ.. ఇక్కడ కాదంటూ ఫైర్ కావటం తెలిసిందే. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన నీతులు చెబితే వినే స్థితిలో తాము లేమన్న వ్యాఖ్యలు చేయటం బాగానే ఉన్నా.. ఆ మాటల్లో లాజిక్ కనిపిస్తే బాగుండేది. రజనీ మాటల్లోని తప్పుల్ని ఎత్తి చూపించి.. వాస్తవాలు ఇవి కదా? అన్నట్లు తెలివిగా మాట్లాడాల్సిన వేళ.. మోటుగా.. ముతగ్గా మాట్లాడటంతోనే సమస్య వచ్చింది.

చిరకాల స్నేహితుడి గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడితే తప్పేంటి? అని రజనీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రజనీ తన ప్రసంగం మొత్తంలో ఎక్కడా.. ఎవరిని కించపరిచింది లేదని.. ఎలాంటి నిందలకు పాల్పడకుండా చేసిన ప్రసంగంపై రజనీ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా విమర్శలు చేస్తారా? అని మండిపడుతున్నారు.

వైఎస్సార్ సీపీ అపాలజీ రజనీ పేరుతో హ్యాష్ టాగ్ పెట్టి కామెంట్లు చేస్తున్నారు.దీంతో.. ఈ హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మరి.. ఈ హడావుడి ఒకట్రెండు రోజులే సాగుతుందా? మరికాస్త ముదురుతుందా? అన్నది చూడాలి.

Similar News