ఆ ఊరి పేరు చెప్పాలంటే సిగ్గుతో చావాల్సిందే !

ఇక ఈ ఊరి పేరు మీద సభలో మాట్లాడారు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు.;

Update: 2026-01-05 17:35 GMT

ఊరి పేర్లు ఇంటి పేర్లు ఎలా వచ్చాయి అంటే అది ఒక చరిత్ర. అయితే కొన్ని ఊరి పేర్లు ఎందుకు అలా వచ్చాయో కూడా ఎవరూ చెప్పలేరు. దాని వెనక కారణాలు కూడా అన్వేషించి ప్రయోజనం లేదు, ఎవరైనా తమ పేరు ఊరు పేరు మంచిగా ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ అలా కాకపోయినా తేడాగా ఉండకూడదని భావిస్తారు. మరీ అసభ్యంగా పేరు ఉంటే ఇదేంటిరా బాబూ అనుకుని సిగ్గుతో చితికిపోతారు. ప్రస్తుతం అలా తాము చేయని నేరానికి అన్నట్లుగా ఆ ఊరి జనాలు ఎంతో బాధపడుతున్నారు. నోటితో పలకలేకపోతున్నారు. ఆ పేరు మార్చండి సారూ అని కనిపించించిన ప్రతీ పెద్దనూ అడుగుతున్నారు. ఎట్టకేలకు ఆ ఊరి సమస్య ఎమ్మెల్యే గారికి చేరడం అలా అసెంబ్లీ వేదికగా దాని ప్రస్తావన రావడంతో ఆ ఊరి పేరు ఏంటి ఇలా ఉంది అని అందరూ ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఇంతకీ అంత ఘోరంగా దారుణంగా ఉన్న ఆ ఊరు పేరు ఏంటో చెప్పడం కష్టమే. లం తో మొదలవుతుంది. లం ...గూడా అన్నది ఆ పేరు పేరుట. మరి ఏ మహానుభావుడు పెట్టారో కానీ తీసేయమని కోరుతున్నారు.

రెవిన్యూ రికార్డుల్లోనూ :

చిత్రమేంటి అంటే రెవిన్యూ రికార్డులలోనూ ఆ ఊరి పేరు లం ...గూడగానే నమోదు కావడం. ఇక ఈ ఊరి పేరు మీద సభలో మాట్లాడారు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. ఆయన సభ దృష్టికి ఈ సమస్యను తెస్తూ తాను సైతం నోటితో ఆ ఊరి పేరు పలకలేకపోతున్నాను అని ఇబ్బంది పడుతూ ఆంగ్లంలోనే స్పెల్లింగ్ చెప్పారు. ఎల్ ఏ ఎన్ జె ఏ గూడా అని ఆ ఊరికి పేరు ఉందని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఊరి పేరుని తక్షణం మార్చాలని సభలో ఆయన డిమాండ్ చేశారు. ఆ ఊరి వారు ఈ రోజుకీ తమ ఊరి పేరుని మార్చుకుని పిలుచుకుంటున్నారు అని గుర్తు చేశారు. నందిగూడాగా వారు అంతా దానికి పేరు పెట్టి మరీ అదే అలవాటు చేసుకున్నారని ఏ శుభకార్యం నిర్వహించినా ఏ ఉత్తర ప్రత్యుత్తరం చేసినా నందిగూడగానే వారు ప్రచారంలో ఉంచి అదే అధికారికంగా కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కాబట్టి ఆ పేరునే అధికారికం చేయడం సముచితం అని ఎమ్మెల్యే హరీష్ బాబు ప్రభుత్వానికి వినతి చేశారు.

ఎక్కడ ఉందీ అంటే :

ఇంతకీ ఆ ఊరు ఎక్కడ ఉంది అంటే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ దగ్గర ఉంది అని అంటున్నారు. ఇక ఈ ఊరి పేరు అయితే సోషల్ మీడియాలో సైతం ఒక వైరల్ గా మారింది అని అంటున్నారు. అంతే కాదు ఆ ఊరి వారి ఆధార్ కార్డులలో కానీ అలాగే ఏ ప్రభుత్వ ధృవీకరణ పత్రంలో కానీ ప్రభుత్వం అందినే అధికారిక పత్రాలు అలాగే రెవిన్యూ రికార్డులలో సైతం లం ...గూడాతోనే ఊరి పేరు వస్తోంది ఎమ్మెల్యే సభ దృష్టికి తెచ్చారు. దాంతో ఊరి జనం బాధ వర్ణనాతీతంగా ఉంది అని చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే ఈ పేరుని తమ నోటితో పలకలేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే హరీష్ బాబు సభలో అవేదన చెందారు. దాంతో ప్రభుత్వం ఆ ఊరి పేరుని మార్చాలని ఆయన గట్టిగానే కోరుతున్నారు. ఆ విధంగా చేసి సర్కార్ కూడా మంచి పని చేయాలని అంతా విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:    

Similar News