సంధ్య థియేటర్‌లో సీక్రెట్ కెమెరా కలకలం: లేడీస్ వాష్‌రూమ్‌లో దారుణం!
వాష్‌రూమ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక యువకుడిని ప్రేక్షకులు పట్టుకున్నారు. ఆగ్రహంతో ఉన్న జనం అతనికి అక్కడికక్కడే దేహశుద్ధి చేశారు.;
బెంగళూరులోని మడివాళ ప్రాంతంలో ఉన్న సంధ్య థియేటర్‌లో ఆదివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సినిమా చూడటానికి వచ్చిన మహిళల భద్రతకు ముప్పు కలిగించే విధంగా లేడీస్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాను గుర్తించడం సంచలనంగా మారింది.
అసలేం జరిగింది?
విక్టరీ వెంకటేష్ నటించిన ఎవర్ గ్రీన్ హిట్ చిత్రం 'నువ్వు నాకు నచ్చావ్' రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్‌కు పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చారు. ఈ క్రమంలో సినిమా విరామ సమయంలో ఒక మహిళ వాష్‌రూమ్‌కు వెళ్లగా అక్కడ అనుమానాస్పదంగా ఉన్న ఒక మొబైల్ ఫోన్/సీక్రెట్ కెమెరాను గమనించింది. అది రికార్డింగ్ మోడ్‌లో ఉండటాన్ని చూసి ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వెంటనే బయటకు వచ్చి తోటి ప్రేక్షకులకు.. థియేటర్ సిబ్బందికి విషయాన్ని తెలియజేసింది. ఈ వార్త తెలియగానే థియేటర్ వద్ద ఉన్న మహిళలు యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిందితుడికి దేహశుద్ధి
వాష్‌రూమ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక యువకుడిని ప్రేక్షకులు పట్టుకున్నారు. ఆగ్రహంతో ఉన్న జనం అతనికి అక్కడికక్కడే దేహశుద్ధి చేశారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రేక్షకులు థియేటర్ ముందు ఆందోళనకు దిగారు.
సమాచారం అందుకున్న మడివాళ పోలీసులు వెంటనే థియేటర్‌కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. థియేటర్ సిబ్బందికి ఇందులో ఏమైనా సంబంధం ఉందా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
పబ్లిక్ ప్లేస్‌లలో ముఖ్యంగా థియేటర్ల వంటి చోట్ల మహిళల రక్షణపై ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. థియేటర్ లైసెన్స్‌ను రద్దు చేయాలని.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
థియేటర్లు లేదా షాపింగ్ మాల్స్‌కు వెళ్ళినప్పుడు వాష్‌రూమ్‌లు.. చేంజింగ్ రూమ్‌లలో అద్దాలు, గోడ మూలలు.. ఎలక్ట్రిక్ ప్లగ్ పాయింట్ల దగ్గర ఏవైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయేమో ఒకసారి గమనించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.