ట్రంప్ ఓపెన్ అయిపోయారు....మోడీ ఏం చేస్తారు ?

ఉక్రెయిన్ రష్యాల మధ్య భీకర యుద్ధంలో అమెరికా కొన్ని ఆంక్షలను విధించింది. రష్యాను ఆర్ధికంగా బలోపేతం కానీయకూడదు అన్న ఉద్దేశ్యంతో ఆ దేశ చమురు ఎవరూ కొనుగోలు చేయవద్దని ఆంక్షలు అయితే ప్రకటించింది.;

Update: 2026-01-05 17:40 GMT

ఏ అమెరికా అధ్యక్షుడికీ లేని ప్రత్యేకత డొనాల్డ్ ట్రంప్ కి ఉంది. అన్నీ ఆయన చాలా ఓపెన్ గానే చెబుతారు. ఏదీ దాచుకోరు, చెప్పి చేయడమే ఆయన స్పెషాలిటీ. వ్యూహాలు కూడా అందులోనే ఉంటాయి. ఆయన రెండవసారి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక తనదైన మార్క్ ని చూపిస్తున్నారు. ఒకటి సైనిక బలంతో రెండవది ఆర్ధిక బలంతో. ఈ విధంగా ప్రపంచానికి నిజమైన పెద్దన్నగా తనను తాను రుజువు చేసుకునే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. వాణిజ్య సుంకాలు అధికం చేయడం ద్వారా ఆయన భారత్ వంటి దేశాల మీద ఒత్తిడి పెంచుతున్నారు. అదే సమయంలో తనకు కావాల్సిన దేశాల మీద సైనిక బలం చూపించి దారికి తెచ్చుకుంటున్నారు.

విజయోత్సాహమేనా :

ఇదిలా ఉంటే వెనెజులా అధ్యక్షుడిని పట్టి బంధించి తెచ్చి ఆ దేశాన్ని గుప్పిట పెట్టుకున్న సక్సెస్ ఫుల్ మూడ్ లో ట్రంప్ ఉన్నారు. దాంతో ఆయన తన ఫోకస్ ని భారత్ మీద మరోమారు పెట్టారు. మోడీ మంచి వారు అంటూనే తనను సంతోష పెట్టడం లేదని ట్విస్ట్ ఇచ్చారు. తనకు ఏమి కావాలో భారత్ కి తెలుసు అంటున్నారు. అంతే కాదు తాను కోరుకుంటున్నది జరగకపోతే అని ఒక విధంగా భారత్ మీద ఒత్తిడి పెంచే విధంగా మాట్లాడుతున్నారు. భారత్ విషయంలో అధిక సుంకాలు విధిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా ట్రంప్ ఇపుడు భారత్ మీద పూర్తి ఓపెన్ అయి చెబుతున్న మాటలు అతి పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.

ఈ రెండూ చేయాల్సిందేనా :

ఉక్రెయిన్ రష్యాల మధ్య భీకర యుద్ధంలో అమెరికా కొన్ని ఆంక్షలను విధించింది. రష్యాను ఆర్ధికంగా బలోపేతం కానీయకూడదు అన్న ఉద్దేశ్యంతో ఆ దేశ చమురు ఎవరూ కొనుగోలు చేయవద్దని ఆంక్షలు అయితే ప్రకటించింది. వీటిని పశ్చిమ దేశాలు తుచ తప్పకుండా పాటిస్తున్నాయి. అయితే తటస్థ దేశంగా ఉన్న భారత్ మాత్రం రష్యాతో తనకు ఉన్న సహజమైన స్నేహ భావంతో చమురు కొంటోంది. అంతే కాదు చవకగా ఇస్తున్నదువల్ల లాభం పొందుతోంది. దీంతో భారత అవసరాలు తీరడమే కాకుండా శుద్ధి చేసిన చమురుని ఎగుమతి చేస్తూ ఆదాయాన్ని సైతం పొందుతోంది అన్నది అమెరికా బాధగా ఉంది. అందుకే రష్యాతో ఇంధన బంధం తెంచుకోమని ట్రంప్ కోరిక. ఇక రెండవది తమ దేశంలోని పాలు, వ్యవసాయ ఉత్పత్తులను భారత్ లో ఇబ్బడి ముబ్బడిగా ఎగుమతి చేస్తామని చెప్పకనే చెబుతోంది. దీని వల్ల భారత్ లోని వ్యవసాయం పాడి పరిశ్రమ రంగం పూర్తిగా దెబ్బ తింటాయని భారత్ ఆలోచిస్తున్నా ఈ రెండు విషయాల్లో మాత్రం అమెరికా మంకు పట్టే పడుతోంది అన్నది జరుగుతున్న ప్రచారం బట్టి తెలుస్తుంది.

భారత్ కి సంక్లిష్టం :

అయితే ఈ విధమైన అడకత్తెరలో పోక చెక్క లాంటి పరిస్థితి అయితే భారత్ కి చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది అని అంటున్నారు. ఎందుకంటే ఏడు దశాబ్దాలకు పైగా భారత్ రష్యాలది మైత్రి. పైగా ప్రతీ సారీ భారత్ కి నిజమైన మిత్రుడిగా రష్యా చాటుకుంటూనే ఉంది. ఇదొక విషయం అయితే మరో వైపు చూస్తే రష్యా నుంచి చవకగా ఇంధనం భారత్ కి లభిస్తోంది. ఇపుడు ఈ డీల్ ని ఉన్నఫళంగా ఆపేస్తే భారత్ లో పెట్రోల్ ధరలు మూడింతలు పెరిగిపోతాయి. దాని ప్రభావం అన్ని రంగాల మీద పడి ఆర్థికంగా దేశం ఇబ్బందుల్లో పడుతుంది. అలా కాదు అనుకుంటే అమెరికా వాణిజ్య సుంకాల ధాటిని భారత్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వాణిజ్య సుంకాల వల్ల భారత్ ఎగుమతులు మరింతగా సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే యాభై శాతం దాకా అధిక సుంకాలు విధించిన అమెరికా దానిని రెట్టింపు చెస్తే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఫార్మాస్యూటికల్స్ ఐటీ సంబంధ ఉత్పత్తులు ఇతరత్రా వాటి మీద తీవ్ర ప్రభావం పడుతుంది, అపుడు అమెరికన్ మార్కెట్ లో భారత్ ఎగుమతులు పోటీ పడే సీన్ ఉండదు, ఎటు చూసినా భారత్ ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడంతో ట్రంప్ చెబుతున్న దాని మీద భారత్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది అయితే ఇపుడు ఆసక్తిగానే ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News