హరీశ్ కోసమే బహిష్కరణ.. బీఆర్ఎస్ లో ఇంటర్నెల్ టాక్!
ఇదే సమయంలో హరీశ్ రావును తిట్టారన్న కారణంగా అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకోవడాన్ని ఎమ్మెల్సీ కవిత కూడా తప్పుపట్టడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.;
తెలంగాణ అసెంబ్లీ బహిష్కరణ ఎపిసోడ్ ప్రతిపక్ష బీఆర్ఎస్ లో విస్తృత చర్చకు దారితీస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ గైర్హాజరు కారణంగా నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడాల్సివుండగా, అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేయాలని బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం వెనుక కారణాలు ఏంటన్న చర్చే ఎక్కువగా జరుగుతోంది. మాజీ మంత్రి హరీశ్ రావుకి ఎలివేషన్ రాకుడదనే ఉద్దేశంతో పార్టీలో ఆయన వ్యతిరేక వర్గం ఈ నిర్ణయం తీసుకోడానికి కారణమైందా? అని ఎక్కువ మంది సందేహిస్తున్నారు. ఇదే సమయంలో హరీశ్ రావును తిట్టారన్న కారణంగా అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకోవడాన్ని ఎమ్మెల్సీ కవిత కూడా తప్పుపట్టడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
బీఆర్ఎస్ లో గత కొన్నాళ్లుగా హరీశ్ రావు ప్రాధాన్యం తగ్గించేలా పావులు కదుపుతున్నారని ఒక ప్రచారం సాగుతోంది. ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు పార్టీ నుంచి బయటకు వచ్చినా హరీశ్ రావునే టార్గెట్ చేయడం చూస్తే పార్టీలో హరీశ్ ఇమేజ్ పెరగకుండా అడ్డుగోడలు కడుతున్నారా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీనికి తాజాగా చోటుచేసుకున్న పాలమూరు-రంగారెడ్డి జలవివాదాన్ని ఉదహరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల 21న తెలంగాణ భవన్ కు వచ్చిన సందర్భంగా కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సూటి ప్రశ్నలు వేశారు.
తెలంగాణ నీటి ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడలేకపోతోందని, తాను బయటకు వచ్చానని, ఇక నుంచి మరో లెక్క అంటూ స్ట్రాంగ్ వార్నింగులిచ్చారు. అదే సమయంలో తోలు తీస్తా అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా విస్తృత చర్చకు దారితీశాయి. గత రెండేళ్లలో ఎన్నడూ లేనివిధంగా కేసీఆర్ మాట్లాడటం, ఇక నుంచి తాను క్రియాశీలంగా పనిచేస్తానని చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీలో జోష్ కనిపించింది. అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాజీ సీఎం కేసీఆర్ మాటలను సవాల్ గా తీసుకుంది. అసెంబ్లీకి వస్తే తేల్చుకుందాం.. అన్నట్లు తగిన కసరత్తు చేసింది.
ఇలా ఇరుపక్షాల మధ్య నీళ్ల పంచాయితీపై రాజకీయం వాడివేడిగా మారిన దశలో అసెంబ్లీలో చర్చ జరిగితే, తగిన సమాధానం ఇవ్వడానికి మాజీ మంత్రి హరీశ్ రావు సిద్ధమయ్యారని అంటున్నారు. అయితే ఆయనకు షాక్ ఇచ్చేలా పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయాన్ని తీసుకున్నారని చెబుతున్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హరీశ్ రావు తన వాణి వినిపించినా, ముందుగా అసెంబ్లీని బహిష్కరించడమే ఎక్కువ హైలెట్ అయిందని, బీఆర్ఎస్ కు ఎక్కువ డ్యామేజ్ జరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే రాజకీయంగా తలపండిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇలా ఆకస్మాత్తుగా అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయాన్ని తీసుకోవడమే ఎవరికీ అంతుచిక్కడం లేదు. అసెంబ్లీలో తాను లేకపోవడం, ఈ సబ్జెక్టుపై పార్టీ వర్కింగు ప్రెసిడెంట్ కేటీఆర్ కు సరైన అవగాహన లేకపోవడం కారణంగా కేసీఆర్ వెనక్కి తగ్గారని విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వంపై విమర్శలు దాడి చేసే అవకాశం హరీశ్ రావుకి ఇస్తే, ఆయనకు మైలేజ్ పెరుగుతుందనే ఆలోచన కూడా ఇందుకు కారణమై ఉంటుందనే ప్రచారం కూడా సాగుతోంది. దీంతో హరీశ్ రావు కోసమే అసెంబ్లీ సెషన్ బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నారా? అని అనుమానిస్తున్నారు.