'ట్రంపరితనం'.. ప్రపంచానికి శాంతిపాఠమా? యుద్ధ సంకేతమా?

ట్రంప్ అనుసరిస్తున్న ‘అమెరికా ఫస్ట్’ విధానం వల్ల చిన్న , బలహీనమైన దేశాలు భయం నీడలో బతుకుతున్నాయి.;

Update: 2026-01-05 17:37 GMT

‘నాకు కొంచెం తిక్కుంది.. కానీ దానికి లెక్కుంది’ అని పవన్ కళ్యాణ్ అన్నాడు.. కానీ తిక్కుంది కానీ.. లెక్కలు లేనే లేవు అంటూ మొండిగా ముందుకెళుతున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నేను అధికారంలో ఉంటే యుద్ధాలే జరగవు.. నేను శాంతి దూతను అంటూ తనకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి నుంచి తరచుగా వినిపించే మాటలు. కానీ చేసేవి మాత్రం సామ్రాజ్యవాద వేశాలు అని ఆయన చర్యలు చూస్తే అర్థమవుతోంది. కానీ, 2026 నాటి ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్ని గమనిస్తే, ట్రంప్ చర్యలు శాంతిని కాక కొత్త రకమైన అస్థిరతను తెస్తున్నాయా? అనే సందేహాలు బలపడుతున్నాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టు నుంచి గ్రీన్‌ల్యాండ్‌పై కన్నేయడం వరకు.. ‘ట్రంపరితనం’ ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

మదురో అరెస్టు.. ప్రజాస్వామ్య ఉద్ధరణా? అగ్రరాజ్య అహంకారమా?

వెనిజులాలో నాటకీయ పరిణామాల మధ్య నికోలస్ మదురోను అమెరికా పట్టుకోవడం అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనం సృష్టించింది. వెనిజులాలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికే తాము ఈ చర్య తీసుకున్నామని.. అణచివేతకు అడ్డుకట్ట వేయడమే తమ లక్ష్యమని వైట్ హౌస్ ప్రకటించింది. ఒక సార్వభౌమ దేశ అధ్యక్షుడిని ఇలా బలవంతంగా అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ‘శాంతి’ కోసం చేసిన ప్రయత్నం కంటే అమెరికా తన ‘కండబలాన్ని’ ప్రదర్శించడానికే ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టమవుతోంది.

గ్రీన్‌ల్యాండ్ వివాదం.. మళ్లీ వలసవాద ఆలోచనలేనా?

డెన్మార్క్ అంతర్భాగమైన గ్రీన్‌ల్యాండ్ భూభాగంపై ట్రంప్ చూపుతున్న ఆసక్తి మరో వివాదానికి కేంద్రబిందువైంది. ఆర్క్టిక్ ప్రాంతంలోని అపారమైన ఖనిజ సంపద, వ్యూహాత్మక సైనిక స్థావరాలపై పట్టు సాధించడమే అమెరికా అసలు ఉద్దేశమని తెలుస్తోంది. ఇది 21వ శతాబ్దపు కొత్త వలసవాదం. దేశాలను కొనుగోలు చేయడం లేదా లొంగదీసుకోవడం అనే ఆలోచన ప్రపంచ భద్రతకు ముప్పు అని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

చిన్న దేశాల భవిష్యత్తు ఏంటి?

ట్రంప్ అనుసరిస్తున్న ‘అమెరికా ఫస్ట్’ విధానం వల్ల చిన్న , బలహీనమైన దేశాలు భయం నీడలో బతుకుతున్నాయి. అగ్రరాజ్యం తన ప్రయోజనాల కోసం ఏ క్షణమైనా తమ దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవచ్చనే ఆందోళన వారిలో నెలకొంది. బలవంతుడిదే రాజ్యమనే ధోరణి పెరిగితే.. ఐక్యరాజ్యసమితి వంటి సంస్థల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది.

ఆజ్యం పోస్తున్న ఇతర శక్తులు

అమెరికా దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఇతర శక్తివంతమైన దేశాలు కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం పావులు కదుపుతున్నాయి. అమెరికా చర్యలను సాకుగా చూపుతూ ఆసియా-పసిఫిక్ , తూర్పు యూరోప్‌లో ఇవి మరింత దూకుడుగా వ్యవహరించే ప్రమాదం ఉంది.ట్రంప్ వైఖరితో అప్రమత్తమైన కిమ్ జోంగ్ ఉన్ తన అణ్వాయుధ పరీక్షలను మరింత వేగవంతం చేస్తూ ఈరోజు బాలిస్టిక్ క్షిపణి పరీక్షను నిర్వహించారు. ఇజ్రాయెల్ పట్ల ట్రంప్ చూపుతున్న అపరిమిత మద్దతు.. ఆ ప్రాంతంలో ఇరాన్ వంటి దేశాలతో ఘర్షణలకు దారి తీయవచ్చు.

2026లో యుద్ధ మేఘాల నీడలో ప్రపంచం?

ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే 2026వ సంవత్సరం ప్రపంచానికి పరీక్షా కాలంగా మారనుంది. ఉక్రెయిన్ సంక్షోభం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ఒకవైపు ఉంటే.. ఇప్పుడు కొత్తగా వెనిజులా, ఆర్క్టిక్ ప్రాంతాల్లో రేగుతున్న సెగలు ‘మూడవ ప్రపంచ యుద్ధం’ అనే భయాలను రేకెత్తిస్తున్నాయి.

డొనాల్డ్ ట్రంప్ తనను తాను 'డీల్ మేకర్' అని పిలుచుకోవచ్చు. కానీ ఆ డీల్స్ చర్చల ద్వారా కాకుండా బెదిరింపులు లేదా బలప్రయోగం ద్వారా జరిగితే అది శాంతికి దారి తీయదు సరే కదా.. కొత్త యుద్ధాలకు పునాది వేస్తుంది. ‘ట్రంపరితనం’ ప్రపంచాన్ని ఎటు తీసుకెళ్తుందో చూడాలి!

Tags:    

Similar News