వెనెజువెలాపై అమెరికా మెరుపు దాడి.. తెర వెనుక ఆసక్తికర అంశాలు
వెనెజువెలాపై అమెరికా జరిపిన మెరుపు దాడులు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో వెనెజువెలాపై జరిగిన సైనిక చర్య ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. కేవలం దాడులు జరపడమే కాకుండా ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించినట్లు ప్రకటించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ ఆపరేషన్ వెనుక మీడియా పోషించిన పాత్ర ఇప్పుడు చర్చనీయాంశమైంది.
వెనెజువెలాపై అమెరికా జరిపిన మెరుపు దాడులు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఈ ఆపరేషన్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. దాడులు ప్రారంభం కాకముందే అమెరికాలోని ప్రధాన మీడియా సంస్థలకు ఈ సమాచారం తెలుసని.. కానీ "జాతీయ భద్రత" దృష్ట్యా వారు గోప్యత పాటించారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
మీడియాకు ముందే తెలుసా?
అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. శుక్రవారం రాత్రి దాడులు ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందే న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటి దిగ్గజ మీడియా సంస్థలకు ఈ సమాచారం అందింది. ఆపరేషన్ వివరాలు ముందే లీక్ అయితే అమెరికా సైనికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రభుత్వ వర్గాలు హెచ్చరించాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆ మీడియా సంస్థలు ట్రంప్ అధికారికంగా ప్రకటించే వరకు వార్తను ప్రచురించకుండా వేచి చూశాయి.
'ట్రూత్' వేదికగా సంచలన ప్రకటన
సాధారణంగా ఇలాంటి కీలక సైనిక చర్యల గురించి శ్వేతసౌధం నుండి అధికారిక ప్రకటన వెలువడుతుంది. కానీ ట్రంప్ తన శైలికి భిన్నంగా శనివారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్’ ద్వారా ఈ విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు.
కాంగ్రెస్ అనుమతి లేకుండానే దాడులు?
అమెరికా రాజ్యాంగం ప్రకారం విదేశాలపై యుద్ధం ప్రకటించాలన్నా లేదా పెద్ద ఎత్తున సైనిక చర్యలు చేపట్టాలన్నా కాంగ్రెస్ అనుమతి అవసరం. అయితే ఈ ఆపరేషన్ విషయంలో ట్రంప్ ప్రభుత్వం ముందస్తు అనుమతి తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది అమెరికా అంతర్గత రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది.
కారకాస్‌లో భయానక వాతావరణం
వెనెజువెలా రాజధాని కారకాస్ ఒక్కసారిగా పేలుళ్లతో దద్దరిల్లిపోయింది.తక్కువ ఎత్తులో యుద్ధ విమానాలు ఎగరాయి.. పౌర,సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరగడంతో ప్రజలు బెంబేలెత్తారు. అధ్యక్షుడు నికోలస్ మదురో , ఆయన సతీమణిని అమెరికా సైన్యం అదుపులోకి తీసుకోవడం సంచలనమైంది..
మీడియా, ప్రభుత్వ బంధంపై చర్చ
సైనిక చర్యలు రహస్యంగా సాగడం సహజం, కానీ మీడియాకు ముందే సమాచారం ఉండటం.. ప్రభుత్వం కోరగానే వారు వార్తను ఆపివేయడం వంటి పరిణామాలు ప్రెస్ ఫ్రీడమ్, నేషనల్ సెక్యూరిటీ మధ్య ఉన్న సన్నని గీతను మరోసారి చర్చకు తెచ్చాయి. ఈ దాడులు లాటిన్ అమెరికా భౌగోళిక రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాలి.