మోడీమానసపుత్రికపై మిట్టల్ కు అంతమంటేంటి?

Update: 2016-02-10 04:25 GMT
రాజకీయాల్లో విమర్శలు మామూలే. కానీ.. బిజినెస్ లో వాతావరణం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. బయటకు ఏమాత్రం చెప్పకుండా గుంభనంగా ఉంటూ..ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ఒకవేళ ప్రభుత్వం మీద గొంతుల దాకా కోపం ఉన్నా.. దాని గురించి ఏ మాత్రం బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల మీద విమర్శలు చేయటం చాలా అరుదు. అలాంటిది భారతీ ఎంటర్ ప్రైజస్ (ఎయిర్ టెల్) వైస్ ఛైర్మన్.. రాజన్ భారత్ మిట్టల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ప్రధాని మోడీ మానసపుత్రికల్లో ఒకటైన మేకిన్ ఇండియా.. స్టార్టప్ ఇండియా కార్యక్రమాలపై ఈ మిట్టల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఔత్సాహిత వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించటంలో ప్రభుత్వం క్రియాశీలకంగానే వ్యవహరిస్తుందని.. కాకుంటే.. దీనికి సంబంధించిన ప్రచారం అతిగా ఉంటోందని వ్యాఖ్యానించారు. స్టార్టప్ లకు.. చిన్న సంస్థలకు క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు అలానే ఉన్నాయని.. చిన్న సంస్థల వ్యాపారాల నిర్వహణ చాలా కష్టంగా ఉంటోందని ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం గమనర్హం.

చిన్న మార్పులతో ర్యాంకింగ్స్ లో మెరుగుపడొచ్చు కానీ.. వాస్తవంగా మెరుగుపడాలంటే చాలానే చర్యలు తీసుకోవాలని చెప్పిన ఆయన.. పోటీతత్వంతో పని చేయాలని వ్యాఖ్యానించారు. గొప్పలు ఎక్కువగా చెప్పుకుంటున్నారంటూ స్టార్టప్ ల మీద విమర్శల సంధించిన మిట్టల్ మరీ అంత విరుచుకుపడాల్సిన అవసరం ఉందా? అన్నది ఒక ప్రశ్న అయితే.. మోడీ మానసపుత్రిక మీద విమర్శలు చేసేందుకు పెద్దగా వెనుకాడకపోవటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుందనే చెప్పాలి.
Tags:    

Similar News