తెలంగాణ‌పై రాహుల్ స్పెష‌ల్ ఫోక‌స్

Update: 2018-07-24 04:55 GMT
వ‌రుస‌గా రెండుసార్లు కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన యూపీఏకు కీల‌కం రెండు తెలుగు రాష్ట్రాలు. విభ‌జ‌న‌కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లే.. యూపీఏ అధికారంలోకి రావ‌టానికి దోహ‌ప‌డ్డాయ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో పార్టీకి ఇబ్బందులు ఎదురైనా.. తెలంగాణ‌లో ఎట్టి ప‌రిస్థితుల్లో త‌మ‌దే అధికారం అనుకున్న కాంగ్రెస్ కు దిమ్మ తిరిగేలా తెలంగాణ ఓట‌ర్లు తీర్పును ఇచ్చారు.

దీంతో..రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ‌లో పార్టీ న‌ష్ట‌పోతే.. రాష్ట్ర విభ‌జ‌న చేయ‌టం కార‌ణంగా ఏపీలో పార్టీ పూర్తిగా దెబ్బ తిన‌టం తెలిసిందే. గ‌డిచిన నాలుగేళ్లుగా కామ్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల మీద ప్ర‌త్యేక దృష్టిని సారించింది. తాజాగా జ‌రిగిన సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది.

ప్ర‌త్యేక హోదా మీద ఇప్ప‌టివ‌ర‌కూ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న ఇవ్వ‌ని కాంగ్రెస్ తాజాగా మాత్రం అందుకుభిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఏపీలో త‌న ఉనికిని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌ద‌ర్శించాల‌న్న కోరిక కాంగ్రెస్ బ‌లంగా వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో మ‌రే ఇత‌ర‌ రాష్ట్ర నేత‌లు కూడా వ్య‌తిరేకించొద్ద‌న్న మాట‌ను చెప్ప‌టం గ‌మ‌నార్హం.

ఇదిలాఉంటే.. తెలంగాణపైనా రాహుల్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇటీవ‌ల తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు స్టార్ట్ చేసి మ‌ధ్య‌లో ఆపిన బ‌స్సు యాత్ర‌ను త్వ‌ర‌లో మ‌ళ్లీ స్టార్ట్ చేయ‌నున్నారు. ఈసారి బ‌స్సు యాత్ర‌లో రాహుల్ కూడా పాల్గొంటార‌ని చెబుతున్నారు. ఎన్నిక‌ల్లో పార్టీ టికెట్ల‌కు సంబంధించి ఇటీవ‌ల త‌లెత్తిన వివాదాల‌కు సంబంధించి రాహుల్ పూర్తి అవ‌గాహ‌న‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది. టికెట్ల పంచాయితీల సంగ‌తి తాను చూస్తాన‌ని చెప్పిన ఆయ‌న‌.. తెలంగాణ‌లో నేత‌లంతా క‌లిసిక‌ట్టుగా ప‌ని చేస్తే.. తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవ‌టం పెద్ద క‌ష్ట‌మైన ప‌ని కాద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల‌పైనా రాహుల్ ప్ర‌త్యేక న‌జ‌ర్ వేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News