ఇప్ప‌టి త‌రం తెలుసుకోవాల్సిన సంజీవ‌య్య

Update: 2018-09-19 07:20 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరు మోసిన ప్ర‌ముఖ రాజ‌కీయ నేత‌ల లిస్ట్ చెప్ప‌మంటే.. వెనుకా ముందు చూసుకోకుండా భారీగా లిస్ట్ చ‌దివేస్తారు. ఆ లిస్ట్ అంతా చెప్పిన త‌ర్వాత‌.. నీతి..నిజాయితీ.. ప్ర‌జ‌ల సొమ్ము రూపాయి ఆశించ‌కుండా ప‌ని చేసే నేత ఒక్క‌రిని చూపించు? అంటే.. నోటి వెంట మాట రాని ప‌రిస్థితి.

అయినా.. నీకు బుద్ది ఉందా?  లేదా?  రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వాళ్ల‌ల్లో అలాంటి వాళ్లు అస‌లు ఉంటారా?  విలువ‌లు పుస్త‌కాల్లోనే కానీ ప్రాక్టిక‌ల్ గా ఉండ‌వ‌న్న నిజాన్ని తెలుసుకో అంటూ క్లాస్ పీకే వాళ్లే ఎక్కువ‌గా క‌నిపిస్తారు. కానీ.. దుర‌దృష్ట‌క‌ర‌మైన విష‌యం ఏమంటే.. నిండైన విలువ‌ల‌తో.. ప్ర‌జా ధ‌నాన్ని పవిత్రంగా భావిస్తూ.. వారి రూపాయిని తాము ముట్టుకోకూడ‌ద‌న్న అత్యున్న‌త ప్ర‌మాణాల్లో ప‌ని చేసిన రాజకీయ నేత‌లు తెలుగు గ‌డ్డ మీద చాలామందే ఉన్నారు.

కాకుంటే వారిని స్ఫూర్తిగా తీసుకునే నేత‌లు లేక‌పోవ‌టం.. చ‌రిత్ర‌లో వారి ఘ‌న‌త‌ను భావి త‌రాల వారు తెలుసుకోకుండా ఉండేలా చేసిన  కార‌ణంగా.. మ‌న‌ల్ని ఏలిన మొన‌గాళ్లు లాంటి మ‌నోళ్ల‌ను మ‌న‌కు మ‌నం గుర్తించ‌లేని ప‌రిస్థితి. ఇప్ప‌టిత‌రం వారికి దామోదం సంజీవ‌య్య పేరు చెప్పినంత‌నే?  ఆయ‌న ఎవ‌రు? అని అడిగేసే ప‌రిస్థితి. ఇక‌.. ఆయ‌న గొప్ప‌ద‌నం గురించి చెపితే ఒక ప‌ట్టాన ఎక్క‌డు ఆ మాట‌కు వ‌స్తే.. అలాంటి పేర్ల‌ను ప్ర‌స్తావించే ధైర్యం.. సాహ‌సం ఇప్ప‌టి త‌రం నేత‌లు చేయ‌ర‌ని చెప్పాలి.

ఎందుకంటే.. అలాంటి నేత‌ల పేర్లు చెప్పినా.. వారి ఘ‌న‌త గురించి ప్ర‌స్తావిస్తే.. త‌మ భాగోతాల్ని ప్ర‌జ‌లు ఇట్టే క‌నిపెట్టేస్తార‌న్న భ‌య‌మే వారి నోటికి తాళాలు వేసేలా చేశాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాజాగా క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ త‌న ప్ర‌సంగంలో భాగంగా దామోదరం సంజీవ‌య్య గురించి ప్ర‌స్తావించారు. తెలుగు నేత‌ల్లో చాలామంది నీతివంత‌మైన నేత‌లు ఉన్నార‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు.

ఈ సంద‌ర్భంగా దామోద‌రం గొప్ప‌త‌నం గురించి చెబుతూ.. సంజీవ‌య్య‌ను ముఖ్య‌మంత్రిని చేయాల‌ని నెహ్రూ బావించార‌ని.. అయితే.. ఆయ‌న అవినీతిప‌రుడ‌ని కొంద‌రు ఫిర్యాదు చేశార‌న్నారు. దీంతో.. సందేహంలో ప‌డిన నెహ్రూ.. సంజీవ‌య్య ఎలాంటివాడ‌న్న విష‌యాన్ని తెలుసుకునేందుకు ఢిల్లీ నుంచి ఒక బృందాన్ని ఏపీకి పంపార‌న్నారు.

వారు.. సంజీవ‌య్య స్వ‌గ్రామానికి వెళ్లార‌ని.. ఒక వీధిలో వెళుతూ.. క‌ట్టెల పొయ్యిపైన వంట చేస్తున్న ఒక వృద్ధురాలిని క‌లిసి.. సంజీవ‌య్య ఇల్లు ఎక్క‌డ‌ని అడిగార‌ని.. దానికి ఆ ముస‌లామె.. ఇదే సంజీవ‌య్య ఇల్లు అని.. తాను సంజీవ‌య్య త‌ల్లిని అంటూ చెప్పార‌న్నారు. సంజీవ‌య్య లాంటి నిజాయితీ ఉన్న నేత ఎక్క‌డా దొర‌క‌ర‌ని స‌ద‌రు బృందం తేల్చ‌టంతో నెహ్రు.. ఆయ‌న్ను ఏపీకి తొలి ద‌ళిత ముఖ్య‌మంత్రిని చేశార‌న్నారు. ఈ సంద‌ర్భంగా సంజీవ‌య్య కుటుంబ‌స‌భ్యుల‌తో రాహుల్ ప్ర‌త్యేకంగా మాట్లాడారు. ఇప్ప‌టిత‌రానికి సంజీవ‌య్య లాంటి మ‌హానీయుల గురించి తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News