రోటీన్ కు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్న రాహుల్..!

Update: 2019-06-15 04:27 GMT
ఒక‌వైపు ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వం.. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీకి చుక్కానిగా ఉండే గాంధీ ఫ్యామిలీ ఇప్పుడు సార‌థ్య బాధ్య‌త‌ల‌కు దూరంగా ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. రాజ‌కీయాల్లో చెప్పే మాట‌ల‌కు చేసే ప‌నుల‌కు సంబంధం లేన‌ట్లుగా ఉంటుంది. అయితే.. ఈ విష‌యంలో తాను రోటీన్ కు భిన్న‌మైన వ్య‌క్తిన‌న్న విష‌యాన్ని రాహుల్ త‌న చేత‌ల‌తో స్ప‌ష్టం చేశార‌ని చెప్పాలి.

కాంగ్రెస్ అధ్య‌క్ష బాధ్య‌త‌ల్ని గాంధీ ఫ్యామిలీ కాకుండా బ‌య‌ట‌వారు చేప‌ట్టాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న రాహుల్.. ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌లైన నాటి నుంచి పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్ నేత‌లు వ్య‌వ‌హ‌రించిన తీరుకు హ‌ర్ట్ అయిన రాహుల్.. తాను అధ్య‌క్ష బాధ‌త్య‌ల్ని చేపట్ట‌లేన‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌కు బ‌దులుగా వేరే వారిని ఎంపిక చేసుకోవాల‌ని కోరారు .

ఇలాంటి అల‌క‌లు నాలుగైదు రోజులేన‌ని.. బ్ర‌తిమిలాడుకోవ‌టం మొద‌లైన త‌ర్వాత మెత్త‌బ‌డ‌టం కామ‌నే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన వారికి రాహుల్ వైఖ‌రి ఇప్పుడు మింగుడుప‌డ‌టం లేదు. తానేమీ నాట‌కాలు ఆడ‌టం లేద‌ని.. అధినేత మార్పు విష‌యంలో తాను క‌మిట్ మెంట్ తో ఉన్న‌ట్లుగా స్ప‌ష్టం చేస్తున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

దీంతో.. కంగుతిన్న‌ కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ఇప్పుడు రాహుల్ కు బదులు ప్రత్యాయ్నామం వెతికే ప‌నిలో ప‌డింది. ఇందులో భాగంగా గాంధీ కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడు క‌మ్ విధేయుడైన ఏకే ఆంటోనికి బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని భావించారు. ఇందులో భాగంగా ఆయ‌న‌తో భేటీ అయ్యారు కాంగ్రెస్ ముఖ్యులు.

త‌న‌కు ఆరోగ్యం స‌హ‌క‌రించ‌టం లేద‌ని.. తాను కాంగ్రెస్ సార‌థ్య బాధ్య‌త‌ల్ని తీసుకోలేన‌ని తేల్చి చెప్పారు. అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్ట‌టానికి తానేమాత్రం సిద్ధంగా లేన‌ని అజాద్ తో చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ర‌థ‌సార‌ధి కోసం కాంగ్రెస్ కు కీల‌క నేత‌లైన అహ్మ‌ద్ ప‌టేల్‌.. గులాంన‌బీ అజాద్ లు విప‌రీతంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఏకే ఆంటోని రిజెక్ట్ చేసిన త‌ర్వాత‌.. మ‌రో సీనియ‌ర్ నేత‌.. రాహుల్ కు స‌న్నిహితుడు..పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ ను సైతం క‌లిశారు.

ఆయ‌న కూడా పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టే విష‌యంలో నో చెప్పేయ‌టం గ‌మ‌నార్హం. త‌న‌కు పార్టీ ప‌రంగా వేర్వేరు బాధ్య‌త‌లు ఉన్నాయ‌ని.. వాటితోనే తాను బిజీగా ఉన్నాన‌ని.. అధ్య‌క్ష ప‌ద‌విని తాను చేపట్ట‌లేన‌ని ఆయ‌న తేల్చి చెప్ప‌టంతో కాంగ్రెస్ సార‌థ్యం ఎవ‌రికి అప్ప‌జెప్పాల‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గామారింది. మ‌రోవైపు రోటీన్ కు భిన్న‌మైన నేత‌గా రాహుల్ నిలిచారు. అల‌క‌పాన్పు ఎక్క‌టం.. నేత‌లు బారులు తీరి అదే ప‌నిగా బ్ర‌తిమిలాడిన త‌ర్వాత‌.. స‌ర్లే అంటూ నిర్ణ‌యాన్ని మార్చుకునే తీరుకు భిన్నంగా రాహుల్ వ్య‌వ‌హ‌రించ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News