యువరాజు రాహుల్‌ కు ఇప్పట్లో నో ఛాన్స్‌!

Update: 2015-09-05 04:26 GMT
ఇంకా మరికొంత కాలం నిరీక్షిస్తూ కూర్చోవాల్సిందే. ఎప్పటినుంచే కన్నేసి ఉన్న పదవి దక్కకుండా.. మరికొంత కాలం.. రాష్ట్రాల్లో పర్యటనలు చేసుకుంటూ.. తనకు తోచిన రీతిలో పాదయాత్రలు చేసుకుంటూ.. వీలైనంత వరకు పార్టీని తాను గాడిలో పెట్టేస్తున్నానని తనకు తాను నచ్చజెప్పుకుంటూ బతకాల్సిందే. అధికారికంగా.. పగ్గాలు మాత్రం.. ఇప్పట్లో దక్కే అవకాశం కనిపించడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కమిటీకి రాహుల్‌ గాంధీ అధ్యక్ష హోదాలో సారథ్య బాధ్యతలు త్వరలో స్వీకరించేస్తారని.. సుమారు గత ఏడాది కాలంగా విస్తృతంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఇప్పట్లో ఆ మాట నిజమయ్యేలా లేదు. ప్రస్తుతం పార్టీ చీఫ్‌ గా ఉన్న సోనియాగాంధీ అధ్యక్ష పదవిని మరో ఏడాది పొడిగించడానికి పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయకమండలి సీడబ్ల్యూసీ కసరత్తు చేస్తూ ఉండడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.

ఏఐసీసీ అధ్యక్షురాలిగా ప్రస్తుతం సోనియాగాంధీ ఉన్నారు. ఈ పదవిని, పార్టీని ముందుకు నడిపించే బాధ్యతను యువరాజు రాహుల్‌ గాంధీ అందిపుచ్చుకుంటారని చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. అఫీషియల్‌ గా పార్టీ అధ్యక్ష బాధ్యత తీసుకోవడం అంటే.. కేవలం అధికారం మాత్రమే కాకుండా.. బాధ్యతను కూడా తీసుకోవడమే అవుతుంది. గత బడ్జెట్‌ సమావేశాల కంటె చాలా కాలం ముందునుంచే రాహుల్‌ గాంధీ పార్టీ పగ్గాలు తీసుకుంటారనే ప్రచారం ఉంది. అయితే బడ్జెట్‌ సమావేశాల నాడు రాహుల్‌.. ఆచూకీ తెలియకుండా తన 'సొంత' పర్యటనకు వెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఆయన తిరిగి రాగానే.. ఇక పార్టీ పగ్గాలు తీసుకుంటారని పార్టీ వర్గాలు ఊదరగొట్టాయి. ఆయన తిరిగొచ్చారు.. యధాపూర్వం తన రాష్ట్రాల పర్యటనలు ప్రారంభించారు గానీ.. పార్టీ బాధ్యత మాత్రం తీసుకోలేదు.

బెంగుళూరులో జరిగిన పార్టీ సమావేశాల్లో రాహుల్‌ ను కొత్త సారధిగా నియమిస్తారనే ప్రచారం కూడా ముమ్మరంగా జరిగింది. అయితే అది కూడా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం సోనియాగాంధీ పదవీకాలం పూర్తి కావస్తోంది. రాహుల్‌ కు బాధ్యతలు అప్పగించే వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లుగా లేదు. సోనియాగాంధీ పదవీకాలాన్నే మరో ఏడాది పాటూ పొడిగించడనికి పార్టీ కసరత్తు చేస్తోంది. మంగళవారం నాడు ఢిల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియాకు అధ్యక్షపదవిని ఏడాది పొడిగించాలని కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాహుల్‌ ఈ పదవి కోసం మరికొంత కాలం నిరీక్షించక తప్పదన్నమాట.
Tags:    

Similar News