కేసీఆర్ నుంచి వారంతా నేర్చుకోవాల్సిందిదే!

Update: 2019-01-01 03:37 GMT
ముంద‌స్తు ఎన్నిక‌లు ముగిసి.. బంఫ‌ర్ మెజార్టీతో టీఆర్ ఎస్ అధికారంలోకి రావ‌టం.. అందులో కీల‌క‌భూమిక పోషించిన కేసీఆర్ కు అందుతున్న ప్ర‌శంస‌లు అన్నిఇన్ని కావు. గ‌తంలో ఎప్పుడూ లేనంత టైట్ ఫైట్ మాదిరి ఎన్నిక‌లు జ‌రిగాయ‌ని.. ఫ‌లితాల్ని ఊహించ‌లేమన్న విశ్లేష‌న‌లు బోలెడ‌న్ని వ‌చ్చినా.. వంద ప్ల‌స్ సీట్లు ప‌క్కా అంటూ అంచ‌నాల్ని చెప్పిన కేసీఆర్ మాట‌ల‌కు చాలామంది న‌వ్వుకున్నా.. తీరా ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత న‌వ్విన నాప‌చేను పండినట్లుగా సీన్ మారింద‌ని చెప్పాలి.

మాట్లాడే వాడే మొన‌గాడ‌న్నట్లు.. ఎలాంటోడైనా స‌రే గెలుపు వారి ఇమేజ్ ను మొత్తంగా మార్చేస్తుంది. ముంద‌స్తు గోదాలోకి దిగిన కేసీఆర్ ధైర్యాన్ని మెచ్చుకున్నోళ్లు ఎంత‌మంది ఉన్నారో.. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ మ‌రీ ఎక్కువ అవుతుంద‌ని.. త‌ప్పుడు నిర్ణ‌యాలతో అవ‌స‌రానికి మించిన త‌ల‌నొప్పులు తెచ్చుకున్నార‌న్న మాట ప‌లువురి నోటా వినిపించింది.

అయితే.. వీటికి భిన్నంగా కేసీఆర్ మాత్రం మొద‌ట ఎలాంటి కాన్ఫిడెన్స్ ను ప్ర‌ద‌ర్శించారో.. ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కూ అదే తీరుతో ఉన్నారు. ఈ రోజు ఘ‌న విజ‌యం సాధించిన త‌ర్వాత కేసీఆర్‌ ను ఇంద్రుడు.. చంద్రుడు అంటూ పొగిడేస్తున్న చాలామంది ఎన్నిక‌ల వేళ‌..అందుకు విరుద్ధంగా వ్యాఖ్యానించిన వారే. 2019 సంవ‌త్స‌రం చాలా కీల‌క‌మైంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల హ‌డావుడి మ‌రో రెండు నెల‌ల్లో షురూ అయిన‌ట్లే. అదే స‌మ‌యంలో మ‌రో తెలుగు రాష్ట్ర‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న స‌భ‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

మోడీ.. రాహుల్.. చంద్ర‌బాబు.. వైఎస్ జ‌గ‌న్.. ప‌వ‌న్‌ లకు ఈ ఏడాది పెద్ద ప‌రీక్ష‌గా చెప్పాలి. వారి రాజ‌కీయ భ‌విష్య‌త్తును ప్ర‌భావితం చేసే ఎన్నిక‌లు మ‌రికొద్ది నెల‌ల్లో జ‌ర‌గ‌నున్నాయి. ఇలాంటివేళ‌.. వారంతా కేసీఆర్ ద‌గ్గ‌ర గెలుపు పాఠాలు నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అనుకున్న‌ది సాధించేందుకు ఎన్ని చేయాలో.. అందునా ఎన్నిక‌లకు సంబంధించిన కిటుకుల్ని.. వ్యూహాల్ని స్పెష‌ల్ ట్యూష‌న్ పెట్టించుకొని మ‌రీ పాఠాల్ని నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఆ విష‌యాన్ని గుర్తించిన మోడీ మాష్టారు.. ఎన్నిక‌ల వేళ కేసీఆర్ ను తిట్టిన నోటితోనే.. ఎలాంటి వ్యూహంతో తెలంగాణ‌లో అంత ఘ‌న‌విజ‌యాన్ని సాధించార‌న్న ప్ర‌శ్న‌తో పాటు.. వ్యూహం చెబుతారా? అని  అడిగిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏమైనా.. విజ‌యం కావాలంటే.. కేసీఆర్‌ ను సంప్ర‌దించాల్సిందేన‌న్న మాట ఇప్పుడు ప‌లువురి నోట వినిపిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Full View

Tags:    

Similar News