ఈ బీసీ నేత కోసం రాహుల్ రంగంలోకి...

Update: 2018-09-13 06:07 GMT
ఆయన ఏనాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఫీలవ్వలేదు.. వ్యవహరించలేదు. బీసీల ఓట్ల కోసం చంద్రబాబు వేసిన పాచికలో పావుగా మారడంతే.. బీసీల ఓట్లు పడకపోవడం.. 2014లో టీడీపీ 15 సీట్లకే పరిమితం కావడంతో టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన ఆర్. కృష్ణయ్య తేలిపోయారు. ఆయన ఎల్ బీనగర్ నుంచి గెలిచినా కూడా అసెంబ్లీలో ఏనాడు పచ్చ కండువా వేసుకోలేదు.. టీడీపీ తరఫున నిలబడలేదు. బాబు కూడా ఎన్నికల తర్వాత ఫలితాలు చూసి ఆర్. కృష్ణయ్యను లైట్ తీసుకున్నారు. తనకు టీడీపీ శాసనసభ పక్ష నేత పదవి ఇస్తారని ఆర్.కృష్ణయ్య కొండంత ఆశలు పెంచుకోగా.. బాబు హ్యాండిచ్చి ఎర్రబెల్లికి ఆ పదవి కట్టబెట్టారు. ఎర్రబెల్లి ఏం తక్కువ తినలేదు. ఏకంగా పార్టీ నాయకుడిగా టీఆర్ఎస్ లో చేరి టీడీపీ మొత్తం టీఆర్ఎస్ లో విలీనం చేశానని ప్రకటించేశారు.

ఇలా తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ అంతర్థానం.. ఆర్.కృష్ణయ్య దూరంగా జరగడం జరిగిపోయింది. ఒక్క సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాత్రమే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 12మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిపోగా.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇప్పుడు ఎటూ కాకుండా ఉన్న ఆర్.కృష్ణయ్య వంతు వచ్చింది.

కాంగ్రెస్ గుజరాత్ ఫార్ములాను తెలంగాణలో అమలు చేస్తోంది. అక్కడ గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ అంటే పడని పటేదార్ ఉద్యమ నాయకులు హార్ధిక్ పటేల్  - ఓబీసీ నేత అప్లేష్ ఠాకూర్ ను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. ఇప్పుడదే ఫార్ములాను రాహుల్ గాంధీ దగ్గరుండి మరీ అమలు చేస్తున్నారట.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తరఫున రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జి కుంతియా .. తాజాగా ఆర్.కృష్ణయ్యతో సుధీర్ఘంగా సమావేశమై కాంగ్రెస్ లో చేరేందుకు ఒప్పించారట.. రాహుల్ ప్రతినిధులు తనతో మాట్లాడారని.. తనను పార్టీలోకి ఆహ్వానించారని ఆర్.కృష్ణయ్య తెలిపారు. త్వరలోనే తాను కాంగ్రెస్ లో చేరుతానని కృష్ణయ్య ప్రకటించారు.

ఇలా ఓ వైపు పొత్తుధర్మంతో టీడీపీతో అంటకాగుతున్న కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ఎమ్మెల్యేలను - బలమైన నేతలను లాగేసుకోవడం టీడీపీ శిభిరాన్ని కలవరపెడుతోంది. భవిష్యత్ రాజకీయాల కోసమే కృష్ణయ్యను కాంగ్రెస్ ఆహ్వానించగా.. ఆయన వెళ్లిపోతుండడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News