ఆ లెక్క‌లు చెప్ప‌క‌పోతే మోడీని న‌మ్మరంట‌

Update: 2016-12-27 08:08 GMT
కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఇటీవ‌లి కాలంలో ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు ఎన్‌.రఘువీరారెడ్డి తాజాగా అదే రీతిలో విరుచుకుప‌డ్డారు. నోట్ల రద్దు తరువాత కొత్త నోట్ల సరఫరా రిజర్వు బ్యాంకు ద్వారా కాకుండా రాజకీయ నిర్ణయాల ప్రకారం జరుగుతోందని ర‌ఘువీరా ఆరోపించారు. కర్ణాటకలో రోజుకు రూ.24 వేలు తీసుకునే వెసులుబాటు ఉంటే తెలుగు రాష్ట్రాల్లో రూ.2 వేలే వస్తున్నాయన్నారు. త్వరలో ఎన్నికలు జరగబోయే ఉత్తరప్రదేశ్‌ - పంజాబ్‌ - ఉత్తరాఖండ్‌, - గుజరాత్‌ తదితర రాష్ట్రాలకు నగదు ఎక్కువగా పంపిణీ అవుతోందని ర‌ఘువీరారెడ్డి ఆరోపించారు.  కొత్తగా ముద్రించిన 5.7 లక్షల కోట్ల కరెన్సీని రాష్ట్రాలవారీగా ఎంత పంపిణీ చేశారో వెల్లడించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ వివ‌రాలు ఇవ్వ‌క‌పోతే మోడీని బీజేపీ నేత‌లు కూడా న‌మ్మ‌ర‌ని ర‌ఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు.

నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో క‌రెన్సీ క‌ష్టాలు ప్రధాని ప్రకటించిన 50 రోజులకు మరో మూడు రోజులు మాత్రమే ఉందని ర‌ఘువీరారెడ్డి గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాల్లో ఇంకా కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. అయితే ఏడాదిలోపు ఎన్నికలు జరగనున్న కర్నాటక తదితర రాష్ట్రాలకు కూడా నగదు అధికంగా సరఫరా అవుతోందన్నారు. ఇంత జరుగుతున్నా తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు ప్రసంగాలతో కాలక్షేపం చేస్తూ ప్రజల అవసరాలను పట్టించుకోవడం లేదని రఘువీరా విమర్శించారు. చెప్పిన గడువులోగా సమస్య పరిష్కరించకుంటే కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు.  2019 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీనే అధికారం లోకి వస్తుందని, అధికారం చేపట్టిన రోజు నుంచే ఆంధ్ర‌ప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను అమలు చేస్తుందని పునరుద్ఘాటించారు. ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జగన్‌ - జ‌న‌సేన నాయ‌కుడు పవన్‌ కళ్యాణ్ ప్ర‌త్యేక‌ హోదా కోసం పోరాటం చేయవచ్చే మోగానీ, హోదాను సాధించే సత్తా మాత్రం కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News