చంద్రబాబుకు రఘువీరా డెడ్ లైన్!
కొద్దిరోజుల క్రితం....విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో క్షుద్రపూజలు జరపడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంలోని పెద్దలకు తెలిసే ఆ పూజలు నిర్వహించారని - పవిత్రమైన ఆలయంలో ఇటువంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఈ వ్యవహారంలో చంద్రబాబు పై కూడా ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. ఆ ఘటన విషయంలో చంద్రబాబు వైఖరి దారుణమని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి నిప్పులుచెరిగారు. ఇలా జరగడం ఇది తొలిసారి కాదని - గతంలో బాబు సీఎంగా ఉన్నప్పుడే అమ్మవారి కిరీటం చోరీ జరిగిందని, తాజాగా గర్భగుడిలో క్షుద్రపూజలు చేసే స్థాయికి వెళ్లిందని దుయ్యబట్టారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన రఘువీరా టీడీపీ - చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
దుర్గగుడి ఫ్లై ఓవర్ పూర్తి చేయడం తన కల అని చంద్రబాబు ప్రగడ్భాలు పలుకుతారని - కానీ పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయని ఎద్దేవా చేశారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణం విషయంలో బాబు తీవ్రమైన జాప్యం చేస్తున్నారని రఘువీరా ఆరోపించారు. మార్చిలోగా ఫ్లై ఓవర్ పూర్తి చేయకుంటే ఏప్రిల్‌లో నిరవధిక దీక్షలకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. బాబు హయాంలో హైదరాబాదులో తెలుగుతల్లి ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఎనిమిదేళ్లు కాలయాపన చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత తాము అధికారంలోకి వచ్చాక `తెలుగుతల్లి`కి మోక్షం లభించిందన్నారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే వ్యవధి ఉండడంతో.....ఏవిధంగా డబ్బులు దోచుకోవాలి అన్నధోరణిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. సీఎం, ఆయన కుమారుడు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ....రాజధానిలో భూకబ్జాలు, ప్రజాధనం దోచుకోవడం పై ఉన్న శ్రద్ధ ....పాలనపై లేదని ఎద్దేవా చేశారు.