ఆరిపోయిన పార్టీ చీఫ్ ‘ఐస్ క్రీం’ మాటలు

Update: 2016-07-18 11:30 GMT
ఏపీలో ఆయనదో ఆరిపోయిన పార్టీ. పదేళ్లు నాన్ స్టాప్ అధికారాన్ని ఇచ్చిన పాపానికి ఏపీని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసేసి.. మళ్లీ కోలుకోలేకుండా ఉండేలా విభజనతో తీవ్ర నష్టానికి గురి చేశారు. దీంతో కడుపు మండిన సీమాంధ్రులు ఆ పార్టీ నామరూపాల్లేకుండా చేసేశారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటును కూడా చేజిక్కించుకోలేని పరిస్థితి.

ఎన్నికలు జరిగి పాతిక నెలలు కావొస్తున్నా ఆ పార్టీలో పట్టుమని పది మంది బలమైన నేతలు లేరు. ఉన్న వారంతా ఏవో ఒక మాటలు చెప్పేసి బతికేయటమే కానీ.. తాము చేసిన ద్రోహానికి ఏపీ ఎంతగా విలవిలలాడిపోతుందన్న బాధ కూడా లేని వైనం వారి మాటల్లో వినిపిస్తుంది. అలాంటి పార్టీ చీఫ్ రఘువీరారెడ్డి.. తాజాగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏ పోలికా దొరకనట్లు.. జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐస్ క్రీమ్ లాంటిదని.. ఇప్పుడా పార్టీ నేతలంతా వెళ్లిపోతున్న నేపథ్యంలో పార్టీ కరిగిపోవటం మినహా మరేమీ మిగలదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పార్టీకి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంటిమెంట్ తప్పించి మరెలాంటి ఆకర్షణ లేదన్న ఆయన.. తమ పార్టీలో ఉన్న సమయంలో జగన్ సీఎం కావాలని అనుకున్నాడని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రయోజనాల కోసం పార్టీ పని చేస్తుందని చెప్పిన రఘువీరా మాటలు కాస్తంత కొత్తగా అనిపించక మానవు. ఒకవేళ ఆయన చెప్పినట్లుగా జగన్ పార్టీ కానీ కరిగిపోయే ఐస్ క్రీమ్ లాంటిదే అయిన పక్షంలో ఆ పార్టీ నుంచి వీడిపోతున్న నేతలంతా.. కాంగ్రెస్ లోకి రావాలి కదా. కానీ.. అలా జరగకుండా ఏపీ అధికారపక్షం గూటికి చేరుతున్నారు. అంటే.. ప్రధాన ప్రతిపక్షం బలహీనమవుతుందే తప్పించి.. ఐస్ క్రీం మాదిరి కరిగిపోవటం లేదనే చెప్పాలి. అయినా.. ఆరిపోయిన పార్టీ చీఫ్ చెప్పిన మాటలు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా?
Tags:    

Similar News