కేసీఆర్ అప్పటి ఆయుధాలే.. ఇప్పటి శత్రువులా?

Update: 2019-10-09 12:30 GMT
సవాళ్లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెనక్కి తగ్గరు. ఆయనకు మొండితనం ఎక్కువే. నిజానికి అదే తెలంగాణ సమాజానికి మేలు చేసింది. ఆయనలోని పట్టుదలే తెలంగాణ రాష్ట్ర సాధనకు కారణం. మరి.. అదే పట్టుదల.. మొండితనం అంతకంతకూ పెరిగి ఆయన్ను దెబ్బ తీసే స్థాయి వరకూ వెళ్లిందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆయుధాలుగా చెప్పే పట్టుదల.. మొండితనం.. వెనక్కి తగ్గనితనం.. లక్ష్యాన్ని సాధించాలనే కాంక్ష ఎక్కువగా ఉండేవి. ఇవన్నీ కేసీఆర్ వ్యక్తిగత ప్రయోజనం కంటే తెలంగాణ జాతి ప్రయోజనమే ఎక్కువగా కనిపించేది. అదే.. ఆయనకు శ్రీరామరక్షగా నిలిచింది. ఉద్యమ వేళలో ఉద్యమ నేతగా వ్యవహరించిన ఆయన మొండితనం ఆయన్ను హీరోను చేస్తే.. నేడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ను పలువురుకి ప్రత్యర్థిగా మార్చటాన్ని మర్చిపోకూడదు.

ఎందుకంటే.. అప్పట్లో కోట్లాది మంది ఆశలు.. ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచిన కేసీఆర్.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా తాను నమ్మిన దానికి కట్టుబడి ఉండటంతోనే అసలు సమస్య అంతా. అప్పట్లో కేసీఆర్ ఆలోచనల్ని ప్రజల వైపు నుంచే ఉండేవి. ఇప్పుడు అధికారపక్ష అధినేత కోణంలోనే ఉంటున్నాయి.

పాలకుడికి.. ఉద్యమకారుడికి తేడా ఎంతో ఉంటుంది. పాలకుడికి సవాలక్ష లెక్కలు ఉంటాయి. ఉద్యమకారుడికి తాను చేరాల్సిన గమ్యం తప్పించి మరింకేమీ ఉండదు. చేతిలో పవర్ ఉండదు కాబట్టి.. తన కలల్ని స్వేచ్ఛగా చెప్పటమే కాదు.. ప్రజలకు కొత్త ఆశల్ని కల్పించే వీలుంది.కానీ.. అధికారపక్ష అధినేతగా అలాంటి అవకాశం ఉండదు. ఎందుకంటే.. అదే పనిగా కలలు కనమని చెబితే సరిపోదు.. తమ కలల్ని సాకారం చేయరెందుకు? అని ప్రశ్నించే పరిస్థితి.

ఎప్పుడైతే ప్రజాకోణం నుంచి బయటకు వచ్చి.. అధికార చట్రంలో కేసీఆర్ చిక్కుకున్నారో.. అప్పటినుంచే ఆయనకు ఆయుధాలుగా ఉన్నవన్నీ ఇప్పుడాయనకు శత్రువులగా మారాయని చెప్పాలి. అప్పట్లో ఆయనలోని మొండితనం లక్షలాది మందిలో భావోద్వేగాన్ని రగిలిస్తే.. ఇప్పుడు అదే మొండితనం అహంకారానికి నిదర్శనంగా మారుతుందన్న విసయాన్ని మర్చిపోకూడదు. అధికారంలో ఉన్నప్పుడు మొండితనం కంటే కూడా.. అందరిని ఆమోదించే ధోరణి.. మెజార్టీ వర్గానికి మేలు చేసే అంశం మీదనే చూపంతా ఉండాలన్న పాయింట్ ను కేసీఆర్ మిస్ కావటమే అసలు సమస్యగా చెప్పక తప్పదు.


Tags:    

Similar News