నువ్వు టీడీపీ కంటే ఏం తక్కువ తిన్నావక్కా?
ఏపీ విషయంలో టీడీపీ అధ్యక్షుడు - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలిపై బీజేపీ నేత పురంధేశ్వరి తీవ్రంగా ఫైరయ్యింది. ఒక ప్లాన్ ప్రకారం బీజేపీని ఇరికించే డ్రామాను చంద్రబాబు చాలా గట్టిగా పండిస్తున్నాడని అన్నారు. అసలు టీడీపీకి అంత మంచి ఉద్దేశమే ఉంటే ఈ పని ఇంత ఆలస్యంగా ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆమె ప్రశ్నించారు. పదేళ్లు హైదరాబాదును వాడుకునే అవకాశం ఇస్తే... ఏపీకి అందరినీ తరలించి అనవసరంగా ఖర్చు పెంచారని పురంధేశ్వరి విమర్శించారు.
బీజేపీ ఏపీకి న్యాయం చేయడానికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆమె స్పస్టంచేశారు. ఇవన్నీ ఓకే గాని పురంధేశ్వరి గారు మీరు టీడీపీ కంటే రెండాకులు ఎక్కువే చదివారు. గతంలో విభజన సమయంలో ప్రభుత్వంలో ఉండి మీ రాజకీయ కెరీర్ కోసం ఏపీని పణంగా పెట్టారు. మీతో పాటు ఉన్న ఇతర మంత్రులు ఆరోజు గట్టిగా పోరాడి ఉంటే ఈరోజు జగన్ గాని ఇతరులు గాని ఇంతలా ఏపీ కోసం పోరాడాల్సిన అవసరమే ఉండేది కాదు. అది మరిచిపోయినట్టున్నారు.
సొంత కెరీర్ కోసం ఏపీని పణంగా పెట్టిన రాజకీయ నేతల పేర్లు చెప్పమని అడిగితే అందులో కచ్చితంగా పురంధేశ్వరి పేరు ఉంటుందని మీరు గుర్తించాలి మేడమ్. టీడీపీది డ్రామానే అనుకుందాం. మీరు ఏం తక్కువ తినలేదు. 56 వేల కోట్ల పోలవరానికి ఇప్పటికీ పాతిక కూడా ఇవ్వలేదు. మరి ఏపీ ఏమైపోవాలి. ఎన్నో సంస్థలు - విద్యా సంస్థలు కేటాయించినంత మాత్రాన ఏపీకి మేలు జరుగుతుందా... వాటికి నిధులిస్తేనే కదా వాటి వల్ల ఉపయోగం. ఎపుడూ మీరున్న పార్టీని కాపాడుకుంటూ పదవులకు ఆరాటపడటమే గాని... మిమ్మల్ని కన్న జన్మభూమి కోసం పోరాడాలని మీకెందుకు అనిపించదు. జగన్ - బాబు - పవన్ ని పక్కన పెట్టండి. మీరే అడగొచ్చుగా ఏపీకి న్యాయం చేయమని. నాలుగేళ్లు గడిచినా మీ బీజేపీ ప్రభత్వం న్యాయం చేయడానికి కట్టుబడి ఉంది. భవిష్యత్తులో కూడా కట్టుబడి ఉంటుంది అంతే. జనం జైట్లీ మాటలను అపార్థం చేసుకున్నారని మీరు అంటున్నారు. జనం కరెక్టుగానే అర్థం చేసుకున్నారు. మీకే సరిగా అర్థం కానట్లుంది.