నల్లజాతీయుడిపై పోలీసుల కాల్పులు.. అమెరికాలో చెలరేగిన హింసాకాండ

Update: 2020-08-26 15:30 GMT
పోలీసులు ఓ నల్లజాతీయుడిపై కాల్పులు జరపడంతో అమెరికా అల్లర్లతో అట్టుడుకుతోంది. నల్లజాతీయులందరూ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్న వేళ ఒక్కసారిగా నల్లజాతీయుల ఆందోళనతో పరిస్థితి మారిపోయింది. హింసాకాండ చెలరేగిన విస్కాన్సిన్ లో గవర్నర్ అత్యవసర స్థితి ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సుమారు ఏడాది కిందట అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలో జార్జ్ ప్లాయిడ్ అనే వ్యక్తి మెడను ఓ పోలీసు తన తొడతో అదిమి పట్టడంతో అతడు మరణించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై అమెరికాలోని నల్లజాతీయులందరూ ఏకమై నిరసనలు వ్యక్తం చేశారు. ప్లాయిడ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రపంచంలోని పలు దేశాలు ఖండించాయి.

ఆ అల్లర్లు ఇంకా సద్దుమణగక ముందే మరో నల్లజాతీయుడిపై కాల్పులు జరగడంతో ఎన్నికల వేళ అమెరికా రణరంగంగా మారింది. కెనోషాలో జరిగిన ఓ గొడవ కారణంగా పోలీసులు కారు ఎక్క బోతున్న జాకబ్ బ్లేక్ అనే వ్యక్తి పై కాల్పులు జరిపారు. ఆ సమయంలో జాకబ్ బ్లేక్ ముగ్గురు కుమారులు కూడా కారులోనే ఉన్నారు. ఈ కాల్పుల్లో జాకబ్ బ్లేక్ తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం బయటకు రావడంతో నల్లజాతీయులు భగ్గుమన్నారు. రోడ్లపైకి వచ్చి పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ పోలీసు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విస్కాన్సిన్ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి విధిస్తూ గవర్నర్ టోనీ ఎవర్స్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల సమీపించడంతో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులైన ట్రంప్, బిడెన్ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వేళ అమెరికా రణరంగంగా మారింది.
Tags:    

Similar News