సాయం చేస్తే మనోడి పై కిడ్నాప్ కేసు.. తాజాగా రూ.210 కోట్ల దావా

ఈ దారుణమైన అనుభవం తనను మానసికంగా కుంగదీయటంతో పాటు.. ఆర్థికంగా దెబ్బ తీసిందన్న ఆవేదను వ్యక్తం చేస్తుంటాడు.;

Update: 2026-02-12 04:34 GMT

కొద్దిరోజులుగా కేరళలో చోటు చేసుకున్న ఒక ఉదంతం పెను సంచలనంగా మారటం తెలిసిందే. సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవటానికి బస్సులో తనను లైంగికంగా వేధించాడంటూ డ్రామా ఆడుతూ వీడియో పెట్టటం.. దానికి 2 మిలియన్ వ్యూస్ రావటం.. తన తప్పు లేకున్నా తనపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకోవటం పెనుసంచలనంగా మారింది.

కట్ చేస్తే.. ఈ ఉదంతంపై పోలీసులు విచారణ జరిపి.. ఆ యువతి నాటకాన్ని బయటపెట్టటంతో అందరూ షాక్ అయిన పరిస్థితి. ఇలాంటి ఉదంతమే ఒకటి అమెరికాలోని మనోడికి ఎదురైంది. షాపింగ్ మాల్ లో పిల్లాడు పడిపోతుంటే.. పడకుండా చెయ్యి అడ్డుగా పెట్టిన పాపానికి కిడ్నాప్ కేసు మోయటమే కాదు.. ఆరు వారాలు జైల్లో ఉండాల్సిన దుస్థితి. కట్ చేస్తే.. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మహిళ మీదా.. తనను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులపై సదరు వ్యక్తి రూ.210 కోట్ల దావాను ఫైల్ చేశారు. కేరళ ఉదంతానికి దగ్గరగా ఉన్న ఈ షాకింగ్ ఉదంతంలోకి వెళితే..

జార్జియాలోని అక్వర్త్ లోని వాల్ మార్ట్ లో టాబ్లెట్స్ కొనేందుకు వెళ్లాడు భారతీయ అమెరికన్ మహేంద్ర పటేల్. 2025 మార్చి 18న అతను వాల్ మార్ట్ లో షాపింగ్ చేస్తున్న వేళలో.. అక్కడున్న ఒక మహిళ కుమారుడు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంటే.. సాయంగా చేతులు అడ్డు పెట్టి ఆపాడు. అయితే.. తన కొడుకును మహేంద్ర పటేల్ కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసినట్లుగా పేర్కొంటూ సదరు మహిళ షాపింగ్ మాల్ సిబ్బందికి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. ఆ పిల్లాడ్ని తాను కిడ్నాప్ చేయలేదని.. సాయం చేశానని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు.

అంతేకాదు.. మహేంద్ర పటేల్ ను అరెస్టు చేసి.. జైలుకు పంపారు. ఆరు వారాల తర్వాత బెయిల్ మీద విడుదలయ్యాడు. చివరకు ఈ కేసును జిల్లా అటార్నీ కార్యాలయం కొట్టేసింది. దీనికి కారణం వాల్ మార్ట్ లోని సీసీ కెమేరాలు. అందులోని విషయాల్ని చూస్తే.. పడిపోకుండా అడ్డుకోవటం.. మహేంద్ర చేసిన పనికి ఫిర్యాదు చేసిన మహిళ థ్యాంక్స్ అన్నట్లుగా చేతి వేళ్లను చూపించిన వైనం సీసీ కెమేరాలో నమోదైంది. అంతేతప్పించి కిడ్నాప్.. పెనుగులాట లాంటివి ఏమీ చోటు చేసుకోలేదని తెలీదు. సీసీ కెమేరా ఫుటేజ్ లేకుంటే తన పరిస్థితి ఏమిటన్న ప్రశ్నను మహేంద్ర పటేల్ సంధిస్తున్నారు.

ఈ దారుణమైన అనుభవం తనను మానసికంగా కుంగదీయటంతో పాటు.. ఆర్థికంగా దెబ్బ తీసిందన్న ఆవేదను వ్యక్తం చేస్తుంటాడు. ట్యాబ్లెట్ కోసం వాల్ మార్ట్ కు వెళితే దారుణ అనుభవం ఎదురైందని.. జరిగిందంతా ఒక పీడకలగా పేర్కొంటారు. తనను నిర్దోషిగా తేల్చిన సీసీ ఫుటేజ్ లేకుంటే.. తన జీవితం మొత్తం జైలుకే అంకితమయ్యేదన్న ఆవేదనను వ్యక్తం చేస్తారు పటేల్. మహిళ ఆరోపించినంతనే తనను జైలుకు పంపిన పోలీసు అధికారులపైనా.. తనపై తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళ మీదా పటేల్ ఇప్పుడు సుమారు రూ.210 కోట్లు మేర పరువునష్టం కేసునునమోదు చేశారు. మరి.. న్యాయస్థానం ఎలాంటి తీర్పును ఇస్తుందో చూడాలి.


Tags:    

Similar News