ఇదేంది సుబ్బారెడ్డి? నెలలో చిన్నప్పన్నకు 6433 సుపథం టికెట్లు?
వైసీపీ సీనియర్ నేత.. టీటీడీ మాజీ ఛైర్మన్ గా వ్యవహరించిన సుబ్బారెడ్డికి సూటిప్రశ్న అన్నట్లుగా ఒక ఉదంతం తెర మీదకు వచ్చింది.;
వైసీపీ సీనియర్ నేత.. టీటీడీ మాజీ ఛైర్మన్ గా వ్యవహరించిన సుబ్బారెడ్డికి సూటిప్రశ్న అన్నట్లుగా ఒక ఉదంతం తెర మీదకు వచ్చింది. తిరుమల కల్తీ నెయ్యి సరఫరాలో నిందితుడైన చిన్నప్పన్నకు తనకు ఎలాంటి సంబంధం లేదని బల్లగుద్ది చెప్పే సుబ్బారెడ్డికి ఉక్కిరిబిక్కిరి చేసే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. చిన్నప్పన్నకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదనే అనుకుందాం. కేవలం నెయ్యి (వైసీపీ నేతలు చెప్పేటల్లు) సరఫరాదారు మాత్రమే అనుకుందాం. అలాంటి వ్యక్తి ఒక నెలలో 6433 సుపథం టికెట్లు జారీ చేయించగల సామర్థ్యం ఉంటుందా? ఎంతపెద్ద తోపు.. తరుంఖాన్ లాంటోడు సైతం టీటీడీ సుపథం టికెట్ల జారీ అంటే.. అది కాకుండా ఇంకేమైనా చెప్పు బాసూ అనే పరిస్థితి.
అలాంటిది అతగాడు మాత్రం నెలలోనే వేలాది టికెట్లు జారీ అయ్యేలా చేస్తే..నాలుగేళ్ల కాలంలో ఇంకెన్ని లక్షల టికెట్లు జారీ చేసి ఉంటాడు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సిఫార్సు ఎవరు చేసినా.. వారి పేరు మీద రాసి టికెట్లు జారీ చేసే అలవాటు టీటీడీలో ఉంది. ఇదే.. ఇప్పుడు చిన్నప్పన్న రేంజ్ ఎంత? ఆయన నడిపిన కతేంటి? అన్నది కళ్లకు కట్టినట్లుగా తెలిసేలా చేసింది. నిజానికి చిన్నప్పన్నకు తనకు ఎలాంటి సంబంధం లేదని సుబ్బారెడ్డి అదే పనిగా చెప్పొచ్చు. కానీ.. ఆయనకు 2018 వరకు పీఏగా పని చేశాడని.. ఆ తర్వాత ఎలాంటి సంబంధం లేదని చెప్పే మాటలో నిజం లేదన్న విషయం తాజా ఆధారాలతో స్పష్టమైందని చెప్పాలి.
ఒక్క నెలలోనే వేలాది సుపథం టికెట్లు జారీ అయితే.. ఇక వీఐపీ బ్రేక్ దర్శనం.. అర్జిత సేవల టికెట్లు ఇంకెంత భారీగా జారీ చేసి ఉంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జగన్ ప్రభుత్వంలో ఒక్కో ఎమ్మెల్యేకు రోజుకు ఆరు సుపథం టికెట్లు మాత్రమే జారీ చేసేవారు. అది కూడా వారానికి ఐదు రోజులు మాత్రమే. చిన్నప్పన్న మాత్రం ఇలాంటి నిబంధనలకు అతీతుడు. ఎందుకంటే 2021 సెప్టెంబరులో ఒక్క రోజు కూడా విరామం లేకుండా రోజుకు సగటున 214 టికెట్లను జారీ చేసిన ఘనత ఆయన సొంతం.
ఇక్కడ ప్రశ్న ఏమంటే.. సుబ్బారెడ్డి అండ లేకుంటే.. ఏపీ భవన్ లో లైజన్ ఆఫీసర్ గా పని చేసే ఒక సాధారణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పేరు మీద టీటీడీ ఛైర్మన్ కార్యాలయం నెలలో 6433 టికెట్లను ఎందుకు జారీ చేస్తుంది? అన్నది ప్రశ్న. ఇప్పుడు సుపథం టికెట్ల లెక్క మాత్రమే వచ్చింది. సుబ్బారెడ్డి ఛైర్మన్ గా ఉన్న కాలంలో ఒక్క చిన్నప్పన్న పేరు మీద మొత్తం టికెట్లు ఎన్ని జారీ అయ్యాయి? ఏ సేవకు ఎన్ని టికెట్లు ఆయన సిఫార్సు చేశారు? లాంటి లెక్కలు బయటకు రావాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2018 తర్వాత తనకు సంబంధం లేదనే సుబ్బారెడ్డి.. తాజాగా బయటకు వచ్చిన లెక్కల విషయానికి ఏమని సమాధానం చెబుతారన్నది అసలు ప్రశ్న.