జగ్గారెడ్డి తీరుపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ సీరియస్

పోలీసులకు జగ్గారెడ్డికి మధ్య జరిగిన వాదనలు.. వాగ్వాదం విషయాన్ని మరింత సీరియస్ అయ్యేలా చేసింది. ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది.;

Update: 2026-02-12 04:32 GMT

తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం పోలింగ్ జరగటం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఎన్నికలకు తగ్గట్లే సంగారెడ్డి మున్సిపాలిటీలో 34వ వార్డుకు సంబంధించిన పోలింగ్ వేళ.. జగ్గారెడ్డి ఎంతటి రచ్చ చేశారో.. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడువైరల్ గా మారాయి. ఇదే అదునుగా బీఆర్ఎస్ నేతలు సైతం ఒక్కసారిగా అలెర్టు అయి రేవంత్ సర్కారును.. జగ్గారెడ్డిని తిట్టిపోస్తున్న పరిస్థితి.

ఇంతకూ అసలేం జరిగిందంటే.. సంగారెడ్డి 34వ వార్డులో పోలింగ్ వేళ.. కాంగ్రెస్ కార్యకర్త చొక్కాను సీఐ పట్టుకున్నట్లుగా సమాచారం అందుకున్న జగ్గారెడ్డి సీన్లోకి ఎంటర్ అయ్యారు. పోలింగ్ బూత్ కు చేరుకున్న జగ్గారెడ్డి పోలింగ్ ఆపేస్తానంటూ పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లాడు. అంతేకాదు.. పోలీసులపై బూతుపురాణంతో తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. సదరుపోలీసు అధికారి సంగతి చూస్తానంటూ జగ్గారెడ్డి బెదిరించిన వైనం ఇప్పుడు వైరల్ గా మారింది.

పోలీసులకు జగ్గారెడ్డికి మధ్య జరిగిన వాదనలు.. వాగ్వాదం విషయాన్ని మరింత సీరియస్ అయ్యేలా చేసింది. ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. తమ పార్టీ కార్యకర్త చొక్కాను పట్టుకున్న సీఐ శివకుమార్ తమ వద్దకు రావాలంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యల్ని టీవీ ఛానళ్లలో టెలికాస్ట్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఉదంతంపై సీరియస్ అయ్యింది. జగ్గారెడ్డి మీద కేసు నమోదు చేసి.. అరెస్టు చేయాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి స్పందిస్తూ.. దొంగ ఓటర్లను అడ్డుకున్న తమపై కేసులు పెట్టమని ఎన్నికల కమిషన్ చెప్పటం కరెక్టా? అన్న ప్రశ్నను సంధించారు. ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి సంగారెడ్డిలో ఓటర్లుగా నమోదు చేశారని ఆరోపిస్తున్నారు. ‘దొంగ ఓట్లు వేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అలా అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్త గల్లాను సీఐ పట్టుకున్నారు. దీంతో నేను వెళ్లాను. గొడవ జరిగింది’ అంటూ తన వాదనను వినిపిస్తున్నారు. అయితే.. ఈ రచ్చపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. కేసులు నమోదు చేయాలని కోరింది. మరేం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News